కాగజ్‌నగర్, జూలై 12: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, పార్టీకి పూర్వ వైభవం తేవాలని నాయకులు, కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాజకీయ పదవులు అనుభవించి, అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఉద్యమ ద్రోహి అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ఫలాలను అనుభవించిన నాయకులు పార్టీకి వెన్ను పోటు పొడిచి కాంగ్రెస్ నాయకుల పంచన చేరడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ద్రోహులను పట్టించుకోవద్దన్నారు.
1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సి ఉండగా 2014 వరకు ఆలస్యం చేసి, వందలాది మంది విద్యార్థుల చావుకు కాంగ్రెస్ పార్టీ కారణమైందని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేక వాదులు కొందరు నాయకులు సిర్పూర్ ప్రాంతంలో యథేచ్ఛగా దోపిడీ చేయడానికే కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విద్యావతి. నాయకులు రాజ్‌కుమార్, శ్యాంరావు, శంకర్, ఆవుల రాజ్‌కుమార్, కౌన్సిలర్ మిన్హాజ్, తదితరులు పాల్గొన్నారు.