ఆసిఫాబాద్ టౌన్,ఆగస్టు 7: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొట్నాక్ భీమ్ రావ్ చిల్డ్రన్స్ పార్క్‌లో సమస్యలు పరిష్కరించి, మరింత అభివృద్ధి చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం ఉదయం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి పార్క్‌ను సందర్శించారు. పారులోని సమస్యల్ని యోగా, వాకింగ్, జిమ్ కోసం వచ్చిన ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. బురదమయమైన ట్రాక్‌ను బాగు చేయాలని, యోగా సాధన కోసం షెడ్డు నిర్మించాలని, తాగునీటి వసతి కల్పించాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని, కోతుల బెడద నివారించాలని కోరారు.
గతంలో మాదిరిగా యోగా మాస్టర్‌కు ప్రతి నెలా వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ట్రాక్ పై క్రషర్ చిప్స్ వేయడంతో యోగా షెడ్ నిర్మాణం, నీటి వసతి, తదితర సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ ఈఈ ప్రభాకర్ , మున్సిపల్ కమిషనర్ భుజంగరావుని కలెక్టర్ ఆదేశించారు.
రెబ్బెన, ఆగస్టు 7: స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములవ్వాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్‌ధోత్రే పిలుపునిచ్చారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భా గంగా బుధవారం రెబ్బెన తహసీల్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కార్యాలయంలో రికార్డులు, ధరణి పోర్టల్ నిర్వహణ తీరు పరిశీలించి పలు సూచనలు చేశారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామా లు, పట్టణాల్లో ఈ నెల 8, 9వ తేదీల్లో సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు, వైద్య శిబిరాలు, ప్రై డే-డ్రై డే, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీపీవో భిక్షపతి, జీఎం రవిప్రసాద్, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో శంకరమ్మ, తదితరులున్నారు. అనంతరం రెబ్బెనలోని సోషల్ వేల్పేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఉపాధ్యాయులు, అధికారులను ఆదేశించారు.