ఆదిలాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని పిప్రిలో బుధవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యేలు సమస్యలను ఏ కరువు పెట్టారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బోథ్, ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పోడు భూముల సమస్యలు, ముంపు బాధితుల ఇబ్బందులు, పునరావాసం, చెరువుల ని ర్మాణం, అటవీశాఖల అనుమతులు, కాంట్రాక్టర్ల పెండిం గ్ బిల్లులు మంజూరు చేయాలని, రుణమాఫీ వంటి ఇతర సమస్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. వెనుకబడిన ఉమ్మడి జిల్లాకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యేల విన్నపానికి సానుకూలంగా స్పందించిన భట్టి తన పాదయాత్రలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని, మిగ తా సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కుప్టీ ప్రాజెక్టు నిర్మాణంతోపాటు నాలుగు లిఫ్ట్‌లను ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోస్తే బోథ్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుంది. రైతు మండలాల రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టును మంజూరు చేసి పనులు ప్రారంభించాలి. దీంతోపాటు నియోజకవర్గంలో రూ. 46 కోట్లతో 19 చెరువులు నిర్మిస్తే 10 వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి. దేగాం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలుకు పునరావాసం కల్పించాలి.
నియోజకవర్గంలో అటవీశాఖ అనుమతులు లేక రహదారుల నిర్మాణాలు జరగడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలి. కొత్తగా ఏర్పడిన సిరికొండ, భీంపూర్, సొనాల మండలాల్లో ప్రభుత్వ శాఖల భవన నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలి. ఆడేగాం ప్రాజెక్టు కెనాల్‌ను నిర్మించడంతోపాటు పిప్రిలో పేదలకు ఇండ్లు మంజూరు చేయాలి. వివిధ సంఘాలకు భవనాలు నిర్మించాలి. మెర్కండి బరంపూర్ రోడ్డుకు అటవీశాఖ అనుమతులు లభించేలా చర్యలు తీసుకోవాలి. గిరిజనులు, గిరిజనేతర రైతులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలి.
కుమ్రం భీం ప్రాజెక్టులోని నాలుగు టీఎంసీల నీటిని లి ఫ్ట్ల ద్వారా ఎత్తిపోసి కెరమె రి, జైనూర్, నార్నూర్, ఉ ట్నూర్ మండలాల్లోని చెరువులు నింపాలి. దీంతో ఈ మండలాల రైతులు రెండు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు కుడి కాలువ పనులు పూర్తి చేయాలి. వట్టివాగు ప్రాజెక్టుకు రూ.25 కోట్లు కేటాయించి మరమ్మతు పనులు చేపట్టాలి. మంచిర్యాల జిల్లాలో కరకట్టలను నిర్మించాలి. సింగరేణి ప్రాంత సమస్యలను పరిష్కరించాలి. మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మిగతా జిల్లాల కంటే ఎక్కువ నిధులు మంజూరు చేయాలి.
అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి. జిల్లాలో రహదారులు లేక గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల నిర్మాణాలు చేపట్టాలి. వాయిపేట్, అంకెన గ్రామాల్లోని అటవీశాఖ అనుమతుల లేని కారణంగా రోడ్ల పనులు జరగడం లేదు. ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు నుంచి ఆసిఫాబాద్ వరకు.. గుడిహత్నూర్ నుంచి మంచిర్యాల వరకు నాలుగు వరుసల రహదారి నిర్మించాలి. పోడు భూముల సమస్యలను పరిష్కరించడంతోపాటు రుణమాఫీలో భాగంగా మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకుల్లోని చిన్న లోపాలను సవరించాలి.
అందమైన ఆదిలాబాద్ జిల్లాను వెనుకబడిన జిల్లాగా పిలువాలంటే బాధగా ఉందని, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్న ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించి అగ్రభాగాన నిలుబెడుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు తెలిపారు. పిప్రి నుంచి ప్రారంభించిన తన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జిల్లాలో 32 రోజులు కొనసాగిందని, స్థానికులు ముందుండి తన యాత్రను కొనసాగించారన్నారు. పాదయాత్రలో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పిప్రి గ్రామ రైతులకు సాగునీరు అందించడానికి కడెం వాగుపై నీటిని ఎత్తిపోసేందుకు రూ.45 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
కుప్టీ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని, చిక్మాన్, త్రివేణి సంగమం పులిమడగు, ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించామని, కుమ్రం భీం ప్రాజెక్టు కాలువల పనులు పూర్తి చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమస్య పరిష్కారంలో భాగంగా రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
సదర్మాట్ ప్రాజెక్టు పనులను నెలరోజుల్లో ప్రారంభిస్తామని, చనాక- కొరాట ప్రాజెక్టును నాలుగు నెలల్లో పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీరు అందిస్తామని తెలిపారు. బుగ్గారం, తేజాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్లకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, డీఎఫ్‌వో ప్రశాంత్ పాటిల్ పాల్గొన్నారు.