మంచిర్యాల అర్బన్, జూలై 30 : పది రోజులుగా వర్షం ఎడతెరిపిలేకుండా కురవడంతో సీజనల్ వ్యాధులు ముసురుకున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం, కొత్త నీరు రావడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ప్రజలు దగ్గు, జలుబు, జ్వరాలు, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు పీహెచ్‌సీలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోజు పెద్దాసుపత్రులకు 300లకు పైగా, పీహెచ్‌సీలకు పదుల సంఖ్యలో రోగులు రావడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నది. దీనికి తోడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖాన 200 పడకల సామర్థ్యం కలిగి ఉండడంతో బెడ్లు సరిపోవడం లేదు. దీంతో వైద్యాధికారులు మడత మంచాలపై రోగులకు వైద్యం అందిస్తున్నారు.
కనీసం బెడ్లు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వానకాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి చికిత్స కోసం వస్తున్న గర్భిణులు, బాలింతలు, శిశువులు కూడా జ్వరాల బారిన పడుతున్నారు.
పదుల సంఖ్యలో డెంగీ కేసుల అనుమానితులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు, 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు, మూడు కమ్యూనిటీ ఆసుపత్రులు, మూడు బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, ఆరోగ్య ఉపకేంద్రాలు ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో రెండు డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు వారం రోజులుగా అధిక సంఖ్యలో జ్వ రాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగనిర్ధారణ పరీక్షలు టీ-హబ్ ద్వారా నిర్వహిస్తున్నారు. జ్వరంతో వచ్చే వారికి డెంగీ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఒకవేళ ఎలీసా పరీక్షల్లో డెంగీ పాజిటివ్ కేసులు వస్తే వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
జాగ్రత్తలు తీసుకోవాలి..
అధికంగా సాధారణ జ్వరాల కేసులు వస్తున్నాయి. మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో 14 జ్వరాలకు సంబంధించిన కేసులు మాత్రమే అడ్మిట్ ఉన్నాయి. ఇప్పటివరకు డెంగీ పాజిటివ్ కేసులు రాలేదు. ఏ రోజు కారోజు రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వచ్చిన రిపోర్ట్ ప్రకారం చికిత్స అందిస్తున్నాం. సర్జరీ, ఆర్థోపెడిక్ వార్డులకు ఫీవర్ రోగులను ఉంచకుండా సెపరేట్‌గా పడకలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నాం. దీనికి తోడు ప్రజలు దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– హరీశ్చంద్రారెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ దవాఖాన, మంచిర్యాల.
జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించాలి
ఇన్చార్జి డీఎంహెచ్‌వో అనిత మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి జ్వర బాధితుల వివరాలను మంచిర్యాల ఇన్చార్జి డీఎంహెచ్‌వో అనిత తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహించాలని వైద్యులు, అధికారులను ఆదేశించారు.
చెన్నూర్ ప్రభుత్వ దవాఖాన జాగ్రత్తలు తీసుకోవాలి..
వర్షాకాలంలో జ్వరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. వర్షాకాలంలో జ్వరాలు, డయేరియా వంటి వ్యాదులు ప్రబలే అవకాశం ఉంది. కరోనా సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉన్నారో, సీజనల్ వ్యాధుల సమయంలో కూడా అలాగే ఉండాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు కలుషిత నీరు, ఆహారాన్ని తీసుకోవద్దు. పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. జ్వరం, డయేరియాతో బాధపడుతూ దవాఖానకు వస్తున్న వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నాం.
– డాక్టర్ సత్యనారాయణ, సూపరింటెండెంట్, ప్రభుత్వ దవాఖాన చెన్నూర్.
జ్వరాల పంజా
చెన్నూర్, జూలై 30 : చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరం బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వ, పైవేటు దవాఖానలు జ్వర బాధితులతో కిక్కిరిసి పోతున్నాయి. జ్వరాలతోపాటు డయేరియా కూడా కొన్ని గ్రామాల్లో ప్రబలుతున్నది. పది రోజు నుంచి చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు రోజు వంద మందికి పైగా జ్వర, డయేరియా బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. జ్వరం తీవ్రత తక్కువ ఉన్న వారు ఔట్ పేషెంట్‌గా చికిత్స పొందుతుండగా, తీవ్రంగా జ్వరం ఉన్న వారు దవాఖానలో చేరి రెండు, మూడు రోజులు ఉండి చికిత్స పొందుతున్నారు.
రోజూ 200 మంది ఔట్ పేషెంట్లు
బెల్లంపల్లి, జూలై 30 : బెల్లంపల్లి వంద పడకల దవాఖానలో రోజు 200 నుంచి 250 మంది సగటున వైద్యం చేయించుకుంటున్నారు. ఇందులో 20 నుంచి 25 మంది అడ్మిట్ అవుతున్నారు. జ్వరపీడితులు అధికంగా వస్తుండగా.. వాంతులు, విరోచనాలు, బలహీనంగా ఉండడం, ఇతర సమస్యలు ఉన్నవారు చికిత్సలు చేయించుకుంటున్నారు. ఓపీ చూడడానికి ఒకరిద్దరు వైద్యులు మాత్రమే ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నామమాత్రపు స్లైన్లు, ఇతర మందులిచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోగులు కాస్త సీరియస్‌గా ఉంటే మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు రెఫర్ చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో డెంగీ పాజిటివ్ కేసులు
సంవత్సరం : కేసులు
2020 : 32
2021 : 118
2023 : 74
2024 : (ఇప్పటివరకు)02