మందమర్రి, ఆగస్టు 12 : కేసీఆర్ సర్కారులో మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని, వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మందమర్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు పాత బస్టాండ్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు డప్పుచప్పుళ్ల నడుమ భారీ ర్యాలీ తీశారు.
మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని బైఠాయించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ నులిగొండ వెంకటేశ్వర్లకు అందించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ ఆయా వార్డుల్లో సమస్యలు నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్థానిక యాపల్, కేకే2. కేకే 3 ఫిల్టర్‌బెడ్ ఏరియాల్లో శ్మశాన వాటికల కోసం గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఇప్పటి వరకు నిర్మించడం లేదన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగాన్ని అవమాన పరుస్తూ, నిర్వీర్యం చేస్తూ మున్సిపాలిటీకి చెందిన రూ. కోటీ 20 లక్షల అభివృద్ధి పనులను పంచాయతీ వ్యవస్థకు అప్పగిండంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, అలాగే అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు.
ఆర్వోబీపై లైటింగ్, మినీ ట్యాంక్‌బండ్‌పై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి సినిమా హాల్ వరకు, అంబేద్కర్ చౌరస్తా నుంచి మార్కెట్ గంప శంకరయ్య దుకాణం వరకు రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. పాతబస్టాండ్ జయశంకర్ సార్ చౌరస్తా నుంచి రామన్ కాలనీ వరకు అసంపూర్తిగా ఉన్న డివైడర్‌ను పూర్తి చేయాలన్నారు. వివిధ వార్డుల్లో దోమలు, కుక్కల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు రాజశేఖర్, ఎండీ అబ్బాస్, కొంగల తిరుపతి రెడ్డి, బోరిగం వెంకటేశ్, మద్ది శంకర్, పంజాల ఈశ్వర్, పల్లె నర్సింగ్, మేడిపల్లి మల్లేశ్, వేల్పుల కిరణ్, సంగ వెంకటేశ్, భట్టు రాజ్‌కుమార్, తోట సురేందర్, సీపెల్లి సాగర్, ఎండీ ముస్తఫా, మహిళా నాయకులు సుగుణ, ఈశ్వరి, లక్ష్మి పాల్గొన్నారు.