మంచిర్యాల, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు పెండింగ్ పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 78 ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు రూ.232 కోట్లు రావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో ఏడు వేల కోట్ల రూపాయలు ఇలా పెండింగ్ పడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కాలర్షిప్లు విడుదల చేసింది. కాంగ్రెస్ సర్కారు మాత్రం ఈ విషయంలో విఫలమైందని ప్రైవేటు కాలేజీల యాజమానులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు మండిపడుతున్నారు.
తెలంగాణ వచ్చిన పదేళ్లలో ఎప్పుడూ కూడా స్కాలర్షిప్ల కోసం రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు, ధర్నాలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. ఇప్పుడు కాలేజీలు నడిపే పరిస్థితి లేక రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలపాల్సి వస్తుందని వాపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీదకు వచ్చిన విద్యార్థులు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అంటూ మరోసారి రోడ్ల మీదకు వచ్చి స్కాలర్షిప్ల కోసం నిరసన తెలపాల్సిన దుస్థితి దాపురించిందంటున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతోనే నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
అప్పులు చేసి, ఉన్న ఆస్తులు అమ్ముకుని ఉద్యోగులకు జీతాలు ఇచ్చామని, ఇప్పుడు అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలోనే ఈ తరహా ర్యాలీ తీశారు. ఆదిలాబాద్లో యాజమాన్యాలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశాయి. నిర్మల్ జిల్లాలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల ఎదుట నిరసన దీక్షలు చేశారు. మూడు, నాలుగు రోజులుగా వివిధ రకాలుగా డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నిరసనలు తెలుపుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి..
గత మూడు సంవత్సరాలుగా స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కళాశాల సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయాలి. లేదంటే ఆందోళనలు చేస్తాం.
– పెట్టం మల్లయ్య, ప్రిన్సిపాల్, వాగ్దేవి డిగ్రీ కాలేజీ , మంచిర్యాల
కళాశాలలనుఆదుకోవాలి ..
పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు చెల్లించకపోవ డంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ప్రైవేట్ కళాశాలలను ఆదుకోవాలి. విడుదల కాకపోవడంతో విద్యార్థులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే విడుదల చేయాలి.
– బాపురెడ్డి(డైరెక్టర్), సంపత్(ప్రిన్సిపాల్), చాణక్య కాలేజీ, మంచిర్యాల
ఆందోళనలు చేస్తాం..
ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్లను విడుదల చేయాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్మెంట్లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే విడుదల చేయాలి.
-జిమ్మిడి గోపాల్, విద్యార్థి సంఘం నాయకుడు
విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు..
ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలి. నిరుపేద విద్యార్థులు , కళాశాలల యాజమాన్యాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించి వెంటనే వీటిని విడుదల చేయాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం.
– సన్నీగౌడ్, విద్యార్థి సంఘం నాయకుడు