ఇచ్చోడ, మే 28 ః ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. అక్రమాలు అరికట్టడానికి, జవాబుదారీతనం పెంపొందించడానికి ప్రత్యేక సంసరణలు చేపట్టింది. సామాజిక తనిఖీల్లో అక్రమాలు అరికట్టడానికి కూలీల హాజరును పని ప్రదేశంలో రెండు పూటలా ఆన్లైన్లోనే తీసుకుంటోంది. మరోవైపు ఏడాదికి ఒకసారి నిర్వహించే ఉపాధి హామీ సామాజిక తనిఖీలను ఆరు నెలలకు ఒకసారి నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది.
ఉపాధి కూలీల హాజరు విధానాన్ని ఆన్లైన్ ద్వారా చేపట్టింది. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్‌లో రోజు ఉదయం కూలీల ఫేస్ రికగ్నేషన్ ద్వారా హాజరు తీసుకుంటున్నారు. అయితే పనికి ఆలస్యంగా వచ్చిన కూలీలు ముందు వచ్చిన కూలీలతో సమానంగా కూలీ తీసుకుంటున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పథకం అమలు, కూలీల కూలీ చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. పని ప్రదేశంలో ఉదయం పనికి వచ్చిన కూలీ ఫొటో, హాజరు, పని మొదటి ఫొటో తీసుకుని నాలుగు గంటల తర్వాత మరో ఫొటో తీసుకోనున్నారు. రెండు పూటలా ఫొటో హాజరు ఉంటే మాత్రమే కూలీలకు రూ.307 చెల్లిస్తున్నారు. ఒకే ఫొటో ఉంటే సగం కూలీ చెల్లిస్తున్నారు. ఎన్ఎంఎంఎస్ యాప్‌లో కూలీల ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు తీస్తున్న క్రమంలో ఫొటోలను పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయి అధికారులు తనిఖీ చేయాలి.
ప్రభుత్వం ఉపాధి హామీ పనులను తనిఖీ చేయడానికి ఏటా సామాజిక తనిఖీ గ్రామసభల అనంతరం ప్రతి మండల కేంద్రంలో మండల సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నది. సంవత్సర కాలంలో కూలీలు చేసిన పనులు, చెల్లించిన నగదును పరిశీలించి నివేదికలు సిద్ధం చేసి వేదికల్లో వినిపిస్తున్నారు. ఏడాదికి ఒకసారి నిర్వహించే సామాజిక తనిఖీలను ఇక నుంచి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఉపాధి హామీ పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి వసతులు కల్పించాలని ఉన్నతాధికారులు టెంట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు, వోఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశాల జారీ చేశారు. కానీ.. చాలా చోట్ల ఆచరణలో కనిపించడం లేదు. వసతులు కల్పించకపోవడంతో ఎండలో పని చేస్తున్న కూలీలకు వడదెబ్బ, జ్వరం, విరేచనాలు, అనారోగ్యానికి గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ లేకపోవడంతో పని ఒకచోట చేసి మరో చోటకు వెళ్లి ఫొటో దిగుతుండడంతో ఆలస్యమవుతున్నదని కూలీలు వాపోతున్నారు. చాలా మంది కూలీలు ఇంటి నుంచే తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఈ విషయమై ఆదిలాబాద్ అదనపు డీఆర్డీవో వి.రాంప్రసాద్‌ను అడుగగా.. కచ్చితంగా రెండు పూటల హాజరు తీయాలి. అవినీతికి పాల్పడ్డ సిబ్బందిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు.
ఉపాధి హామీ అధికారులు పాత పద్ధతినే కొనసాగించాలి. ఎండలు విపరీతంగా ఉండడంతో అక్కడ పని వెళ్లడంతో రెండు ఫొటోల కోసం నాలుగు గంటల తర్వాత వేచి చూడాల్సి వస్తుంది. దీంతో ఇంటికెళ్లే సమయంలో ఎండ తీవ్రమవుతున్నది. లేకపోతే ఒక పూటనే ఫొటో హాజరు తీయాలి. పని ప్రదేశంలో 50 నుంచి 100 మంది కూలీలు ఉండడంతో ఫొటోల హాజరు తీసే వరకు గంట సమయం పడుతున్నది.
– సి.భీం బాయి, సుంకిడి, సిరికొండ
ఉదయం ఆరు గంటలకు పనులకు వెళ్తున్నాం. నాలుగు గంటలు పని చేస్తున్నాం. పని చేసే ప్రదేశంలో తాగునీరు, కూర్చొవడానికి నీడ ఏర్పాటు చేయడం లేదు. ఉపాధి హామీ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పిన చేయడం లేదు. రెండు రోజుల క్రితం మాలో ఒకరికి ఎండదెబ్బ తగిలి స్పృహా కోల్పోయాం. తాగడానికి వోఆర్ఎస్ ప్యాకెట్లు లేవు. ఇప్పటికైనా పని ప్రదేశంలో వసతులు కల్పించాలి.
– కేస్వే వందన, బజార్హత్నూర్
మండలాలు 21
పంచాయతీలు 478
ఉపాధి కూలీల సంఖ్య 2.70 లక్షలు
యాక్టివ్ కూలీలు 2.50 లక్షలు
మొత్తం జాబ్ కార్డులు 1.10 లక్షలు