ఎదులాపురం/నిర్మల్ టౌన్, మే 29: తెలం గాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను జయ ప్రదం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 22 న ముగుస్తాయని చెప్పారు. పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహిం చాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఈ వేడుకలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, దళితులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలన్నారు. ఉత్సవాల నిర్వహణ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. రైతు దినోత్సవం, ఊరూరా చెరువుల పండుగ నిర్వహణపై అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రైతు వేదికల్లో వేడుకలు నిర్వహించాలన్నారు.
ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, అమ లు చేస్తున్న పథకాలు తెలియజేయాలని సూచించారు. జూన్ 8న ఊరురా చెరువుల పండుగ సందర్భంగా చెరువుల వద్ద బతుకమ్మ, బోనాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కట్ట మైసమ్మకు పూజలు చేయాలని చెప్పారు. దశాబ్ది వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు రాహుల్ రాజ్, కలెక్టర్ వరుణ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమాల్లో ఎస్పీలు ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రాంబాబు, డీఎఫ్‌వో రాజశేఖర్, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీపీవో శ్రీలత, డీఆర్డీవో విజయలక్ష్మి ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్లు శ్రీజ, వికాస్ మహతో, ఆర్డీవోలు రాథోడ్ రమేశ్, కదం సురేశ్, అధికారులు పాల్గొన్నారు.