దండేపల్లి, అక్టోబర్28: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు వద్ద పద్మల్పురి కాకో(ఏత్మాసార్) ఆలయానికి వచ్చిన ఆదివాసులతో గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారింది. సోమవారం ఆలయ ఆవరణలో గుస్సాడీ దర్బార్లో వేలాది భక్తులు పాల్గొన్నారు. ముందుగా ఆలయం సమీపంలో గోదావరిలో స్నానాలు చేసి నది ఒడ్డున పూజలు చేశారు. నదీ జలాలతో వచ్చి కాకో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
కానుగ నూనెలో తయారుచేసిన గారెలను నైవేద్యంగా సమర్పించారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించారు. కొత్తగా పెళ్లయిన జంటలకు అమ్మవారి ముందు భేటీ కార్యక్రమం నిర్వహించారు. కొత్త కోడళ్లను అమ్మవారికి పరిచయం చేయించారు. అనంతరం ఆలయ ఆవరణలో వంటలు చేసుకొని భోజనాలు చేశారు. చుట్టు పక్కల జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ నుంచి గోండ్, ప్రధాన్, కోలాం, తోటి, తదితర ఆదివాసీ గిరిజనులు వేలాదిగా తరలి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు వసతులు కల్పించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఒడిషా రాష్టాల నుంచి వచ్చిన గుస్సాడీ కళాకారులు వేషధారణలు, రేలా రేలా పాటలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆదివాసీ మహిళలు కోలాట ప్రదర్శనలో పాల్గొని సంప్రదాయ నృత్యాలు చేశారు.
ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జీసీసీ (తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్) చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. పద్మల్పురి కాకో ఆలయంలో అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం గుస్సాడీ దర్బార్లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడి భావితరాలకు అందించాలన్నారు. పురాతన చరిత్ర కలిగిన పద్మల్పురి ఆలయ విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కాకో అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ పట్టు వస్ర్తాలు సమర్పించి, పూజలు చేశారు. ఆదివాసీ యువకులు ఉన్నత చదువులపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేందర్, ఎస్ఐ ఉదయ్ కిరణ్, ఆలయ కమిటీ చైర్మన్ కుడిమెత సోము, మాజీ సర్పంచ్ చిట్ల మంజుభార్గవి, రాయి సెంటర్ జిల్లా సభ్యుడు పెందురు రాంపటేల్, తుడం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు పుర్క బాపురావు, పర్ధాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు అడాయి కాంతారావు, తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు కన్నాక జంగు, ఆదివాసీ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు ఉన్నారు.
నస్పూర్/ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, అక్టోబర్ 28 : సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి దండారీకి రూ. 15 వేల చొప్పున కేటాయించినట్లు ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సహకారంతో ఐటీడీఏ ఉట్నూర్ పరిధిలోని వెయ్యి గ్రామాల్లోని ప్రతి దండారీకి రూ.15 వేల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు.