దళితబంధు దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. డ్రైవర్లు ఓనర్లుగా.. కూలీలు యజమానులు మారారు. దళితబంధు పథకంలో భాగంగా రూ.10 లక్షలు విలువ చేసే యూనిట్లు సొంతం చేసుకొని ఉపాధి పొందుతున్నారు. నియోజకవర్గానికి 100 మంది చొప్పున నిర్మల్ జిల్లావ్యాప్తంగా మూడు నియోజకవర్గాల పరిధిలో రూ.26.10 కోట్లతో 261 మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. వీరందరికీ వారు కోరుకున్న వాహనాలు, దుకాణాలు, హార్వెస్టర్లు, జేసీబీ యంత్రాలతోపాటు గొర్లు, డైరీ యూనిట్లు అందించారు. ఇద్దరు లబ్ధిదారులు కలిపి ఒక హార్వెస్టర్, ముగ్గురు లబ్ధిదారులు కలిపి ఒక జేసీబీని కొనుగోలు చేసుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకొని సగర్వంగా బతుకుతున్నారు. రెండో విడుతలో నియోజకవర్గానికి 500 యూనిట్లు మంజూరవగా.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. కాగా.. పథకం ప్రారంభమై యేడాది పూర్తయింది.
– నిర్మల్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ)
నాడు మెకానిక్.. నేడు ఆటోమొబైల్ దుకాణం ఓనర్‌ను..
నా పేరు నాడెం రాకేశ్. మాది నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి. మా అమ్మ కుంత పేరిట దళిత బంధు పథకం మంజూరైంది. నేను నాలుగేళ్లుగా నిర్మల్ జిల్లాకేంద్రంలోని బజాజ్ ఆటో షోరూంలో మెకానిక్‌గా పని చేసిన. ఆటోమొబైల్ షాప్ పెట్టుకుంటామని అధికారులకు చెప్పినం. మా కోరిక మేరకు రూ.10 లక్షలు మంజూరు చేశారు.
నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదుట షాప్ పెట్టుకున్న. రోజు రూ.2వేల నుంచి రూ.3 వేల గిరాకీ అవుతోంది. అంతేకాకుండా ఆటోలను రిపేర్ చేస్తూ రోజుకు రూ.500 నుంచి రూ.600 సంపాదిస్తా. ఇలా నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల ఆదాయం సమకూరుతోంది. గతంలో మెకానిక్‌గా పనిచేసినప్పుడు నెలకు రూ.6 వేలు మాత్రమే వచ్చేవి. వచ్చిన జీతం నా ఒక్కడి ఖర్చులకే సరిపోయేవి. అమ్మ బీడీలు చుడుతూ, నాన్న కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవారు. సీఎం కేసీఆర్ సార్ దయతో ఆటోమొబైల్ షాపు యజమానిని అయ్యా. సమాజంలో సగర్వంగా తలెత్తుకొని బతుకుతున్న.