కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు ఎప్పుడు వచ్చేదో.. ఎప్పు డు పోయేదో తెలిసేది కాదు. కరెంటుపై అస లు గ్యారంటీ ఉండేది కాదు. రాత్రీ.. పగలూ పొలాల కాడ ఉండి నీళ్లు పారిచ్చేటోళ్లం. ఒక్క వానకాలం పంటే తీసేది. ఇగ ఎండాకాలంలో పొలాలన్నీ బీళ్లుగానే ఉండేటివి. ఆనాడు నరకం చూసినం. ఇక వెల్డింగ్, మెకానిక్‌వంటి దుకాణాలు నడిపించే వారికి గిరాకీలుండేటివి కావు. కరెంట్ కోతల వల్ల అనేక పరిశ్రమలు మూతపడ్డయ్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక 24 గంటల ఉచిత కరెంటిచ్చిన్రు.
రైతులందరం పదేండ్ల పాటు రంది లేకుంట ఎవుసం చేసుకున్నం. యేటా రెండు.. మూడు పంటలు కూడా తీసినం. నిరంతర విద్యుత్‌తో చిరువ్యాపారులకు సైతం చేతినిండా పని దొరికింది. ఇదంగా కేసీఆర్ గొప్పతనమే. గాయనలెక్క మంచి పనులు చేసినోళ్లు లేరు. ఇప్పుడు కాంగ్రెసోళ్లు అధికారంలోకి వచ్చినంక మళ్లా కరెంట్ కష్టాలు మొదలైనయ్. ఎప్పుడు పడితే అప్పుడు కోతలు పెడుతున్నరు. యాసంగిలో పంటలు ఎండిపోయినయ్. గీ వర్షాకాలంలో కూడా కరెంటు సరిగా ఇస్తరో.. ఇవ్వరోనని భయమైతంది.’ అని రైతులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ రాకముందు కరెంటు కష్టాలు అనుభవించినం. కరెంటు ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. పంటలేసి మస్తు నష్టపోయినం. కొందరైతే ఎవుసం ఇడిసిపెట్టి కూలీ పనులకు పోయిన్రు. మన రాష్ట్రం వచ్చి కేసీఆర్ సీఎం అయినంక రైతుల బాధలు తీర్చిండు. 24 గంటలు కరెంటిచ్చి ఢోకా లేకుంట చేసిండు. ఎవుసాన్ని పండుగలా చేసిండు. రంది లేకుంట పంటలు తీసినం. ఇగ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్లా బాధలు మొదలైనయ్. ఇష్టం వచ్చినట్లు కరెంట్ కోతలు పెడుతున్రు. మస్తు గోస పెట్టుకుంటున్నరు. ఇగ గిట్లయితే పంటలు తీసినట్లే. కరెంటిచ్చుడు చేతగాక రాజకీయ కక్షతో కేసీఆర్ సార్‌ను బదునాం చేస్తున్నరు. – జాటోత్ శంకర్, బర్రెపెల్లి, దహెగాం మండలం
2014 కంటే ముందు కరెంటు లేక అష్టకష్టాలు పడ్డం. కరెంటు లేక, లో ఓల్టేజీతో మోటర్లు కాలిపోయేవి. రైతులు అరిగోస పడుతున్నా పట్టించుకునేవాళ్లు కాదు. కాలిపోయిన కరెంటు మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు రిపేరు చేయించుకునేందుకు తిప్పలపడేటోళ్లం. తెలంగాణ వచ్చినంక మా గోస తీర్చింది కేసీఆరే. 24 గంటల పాటు కరెంటిచ్చిండు. పదేండ్లు రంది లేకుంట పంటలు తీసినం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక మళ్లా కరెంట్ కోతలు పెడుతున్నరు. పంటలు పండుతయన్న గ్యారెంటీ లేకుంటైతంది. ఎట్లా బతుకుడో.. ఏమో ఇగ.
– నగేశ్, రైతు, పెంచికల్పేట్