కాంగ్రెస్‌ను నమ్మితే బతుకులు ఆగమవుతాయని జిల్లా రైతులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ వచ్చేదాక ఎసోంటి గోస పడ్డమో.. ఎన్ని కష్టాలు పడ్డమో ఆ భగవతునికే తెలుసని వాపోతున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు గానీ, అన్నదాతలను ముంచే కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు అని చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. 24 గంటల కరెంట్ ఉన్న కాడ ఈ మాయమాటలేందని నిలదీస్తున్నారు. పైగా 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇవ్వడంపై ఆగ్రహిస్తున్నారు.
రెండు రోజుల క్రితమే ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని, కేంద్రం మంత్రి నిర్మలా సీతారమన్ మాటలతో కాంగ్రెస్ మోటర్లకు మీటర్ల పెట్టే కుట్ర బట్టబయలైందని మండిపడుతున్నారు. వాళ్లను నమ్మితే మోటర్లకు మీటర్లు పెడుతరని, 24 గంటల కరెంట్ తీసేసి 3 గంటల ఇస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు వాళ్ల పాలనలో అరిగోస పడ్డామని, కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక రాత్రిళ్లూ జాగారం చేశామని, కండ్ల ముందే పంటలు ఎండుతుంటే కన్నీళ్లు పెట్టుకున్నామని గుర్తు చేశారు. దొంగ రాత్రి కరెంట్ ఇ చ్చి ఎందరో రైతుల ఉసురు పోసుకున్న ఆ పా ర్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
దిలావర్పూర్, నవంబర్ 24 : తెలంగాణల కాంగ్రెస్ అధికారంలకు వచ్చేది కాదు.. సచ్చేది కాదు.. ఆ పార్టీ 50 ఏండ్లు దేశాన్ని పాలించి, అన్ని స్కాంలే జేసింది. మూడు గంటల కరెంట్ ఇచ్చి, 10 హెచ్‌పీల మోటర్లు పెడితే కరెంట్ ఆదా చేసినవాళ్లమవుతామంటున్నరు. ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రంల 10 హెచ్‌పీ మోటర్ల ఎందుకు పెట్టిస్తలేరు. ఆ పార్టీ ఎన్ని విధాలుగా చెప్పినా ప్రజలు, రైతులు నమ్మరు. ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల కరెంట్ చాలు అని పదేపదే చెప్తున్నడు. రైతుల కష్టాలు, వారి భాదలు ఆయనకేం తెలుస్తది. మూడు గంటల కరెంట్ ఇస్తే మూడు గుంటలు కూడా తడ్వదు. – బాబురావు, రైతు
సారంగాపూర్, నవంబర్ 24 : కాంగ్రెసోళ్ల హయాంల చీకటి కష్టాలను కండ్లారా చూసినం. కరెంటు వస్తూ, పోతుండడంతో మోటర్లు కాలిపోయి ఇబ్బందులువడ్డం. పంటలు పండించేందుకు రాత్రింబవళ్లు వంతుల వారీగా పొలాల్లో జాగారాలు చేసినం. ఏటా మోటర్లు కాలిపోతే మంచిగచేయించేందుకు తిరగాల్సి వచ్చేది. అన్ని కష్టాలువడ్డ మేము తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ దయవల్ల నిరంతర విద్యుత్‌తో బాధలు తీరినయ్. కరెంట్ ఉంటే వేసిన పంటను ఎంత ఇబ్బంది పడైనా కాపాడుకునే ధైర్యం వచ్చింది. ఎవరెన్ని మాటలు చెప్పినా కరెంట్ అందించడంలో కేసీఆరే మొనగాడు. ఇది యావత్ సమాజం ఒప్పుకొని తీరాల్సిందే.
– జాదవ్ రమేశ్, రైతు, మహావీర్తండా
సారంగాపూర్, నవంబర్ 24 : రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంటే ఇస్తానంటున్నడు. పైగా 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకుంటే సరిపోతదని అంటున్నడు. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటిస్తే వ్యవసాయం చేయడం ఎట్లా సాధ్యమైతది. 24 గంటలుంటే ఎప్పుడంటేగప్పుడు పోయి మోటర్ ఏసుకొని నీళ్లు పొలానికి పారించుకుటున్నం. మూడు గంటల కరెంటంటే రైతులంతా అప్పుడే పోయి మోటర్లు ఒత్తుతరు. అందరూ ఒక్కటేసారి ఆన్జేత్తే టాంచిపారాలు ఉంటయా. పేలిపోతయ్. పైగా మూడు గంటల కరెంటుతోటి పొలంతా నీళ్లు ఎట్ట పారిత్తరు. గా విషయం గూడా ఆయనకు తెల్వది. గెలువక ముందే రేవంత్‌రెడ్డి కరెంట్ మీద గిట్లమాట్లాడడం మంచిపద్ధతి కాదు. ఇక కాంగ్రెస్సోళ్లు గెలిచినంకా ఇంకా ఏముందో, గందుకే గీ కాంగ్రెసోళ్లను నమ్మం. ఓటు కూడా వేయను. కారుగుర్తుకు ఓటు వేస్తాను.
– గోస్కుల శివయ్య, రైతు, ఆలూర్
సారంగాపూర్, నవంబర్ 24 : తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుండడంతో సాగు రూపురేఖలే మారినయ్. రైతును రాజును చేసింది కరెంటే. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్.. అప్పుడు ఏంజేయలే. కొత్తగా సాగుకు 3 గంటల కరెంట్ ఇచ్చి, 10హెచ్‌పీ మోటర్లు పెడుతామంటున్నరు. కాంగ్రెస్ నాయకులకు ఎప్పుడూ రైతులపై చిన్నచూపే. రైతు బాగు పడడం కాంగ్రెసోళ్లకు ఏ మాత్రం ఇష్టం లేదు. కాంగ్రెసోళ్ల మాటలింటే రైతులు కరెంట్, ఎరువులు, విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిందే. మా బతుకులు ఆగమైపోతయ్. రైతుల మీద మళ్లా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నరు. ఇది తెలువకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటు. రైతులను మోసం చేసే కాంగ్రెస్‌ను ఓడించుడే.
– ఒలకరి లక్ష్మణ్, రైతు, ధని
దిలావర్పూర్, నవంబర్ 24 : రైతులు బాగుపడుడు కాంగ్రెస్‌కు ఇష్టం ఉండదని మా తండ్రి చెప్పేవాడు. రైతులు ఎప్పుడు అప్పులు జేసి, పంటలు సాగు చేయాలన్నదే ఆ పార్టీ కోరిక. 50 ఎండ్ల కాంగ్రెస్ పాలన ఇప్పుడిప్పుడే మర్చిపోయి, సంతోషంగా ఎవుసం చేసుకుటున్నం. మా పిల్లలను ఉన్నత చదువులు చదివిపిస్తున్నం. కానీ, గీ కాంగ్రెస్ మళ్లా ఇప్పుడు వచ్చి, రైతులకు మూడు గంటల కరెంట్ చాలు, 24 గంటల కరెంట్ ఎందుకు అని అంటున్నది. అది ఎటూ సరిపోదు. దేశానికి అన్న పెట్టే రైతులను ఆ పార్టీ ఎప్పుడూ చులకనగానే చూస్తుంది. వాళ్లు చెప్పినట్టు చేస్తే, వ్యవసాయం చేయడం కష్టంగా మారి ఉన్న భూములను అమ్ముకోవాల్సి వస్తుంది. 3 గంటల కరెంట్ వద్దు. మీ కాంగ్రెస్‌కు ఓటు వేసుడద్దు..
– కుంటా గంగారెడ్డి రైతు
దిలావర్పూర్, నవంబర్ 24 : బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు ఎవుసానికి కరెంట్ లేక రేయింబవళ్లు కష్టపడ్డం. నాలుగు పైసలు మిగిలేదికాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఉచితంగా ఇవ్వడంతో మా బతుకులు కుదుటపడ్డయ్. కాంగ్రెస్ పార్టీకి కరెంట్ మీద, రైతుల మీద ఎమైనా అవగాహన ఉందా. 3 గంటల కరెంట్ ఇస్తే ఎవుసం ఎట్లజేత్తరు. దాని గురించి ముందు చెప్పి ఓట్లు అడుగున్రి. ఉన్న మోటర్లను పీకేసీ 10 హెచ్‌పీల మోటర్లు కొనాలంటే లక్ష అవసరమైతది. ఆ పైసలు బాకి తెచ్చి, మీరు ఇచ్చే 3 గంటల కరెంట్‌తో పంటలు పండుతాయో లేవో తెలియదు. మీరు చెప్పిన మాటలను నమ్మం. మీ పార్టీకి మీ నాయకుడికి రాం రాం.
– గుణవంతురావు, రైతు
సారంగాపూర్, నవంబర్ 24 : తెలంగాణ వచ్చినంక 24 గంటల కరెంటు అందుతున్నది. రైతులకు పగటిపూట నీళ్లు పారించి, రాత్రిపూట హాయిగా ఇంటి దగ్గరేన పడుకుంటున్నం. కాంగ్రెసోళ్లు అర్ధరాత్రికి కరెంటిచ్చేటోళ్లు. బాట్రీలు తీసుకొని చేన్లకు పోతే పురుగు, పాములు కరిసి చాలా మంది చనిపోయిన్రు. కరెంట్ సక్కగ రాక నానా కష్టాలువడ్డం. 24 గంటల కరెంటు పుణ్యమా అంటూ ఇబ్బందులు లేని జీవితం గడుపుతున్నం. కాంగ్రెసోళ్లు చెపిపనట్లు మూడు గంటల కరెంటైతే మా జీవితాల్లో చీకట్లు అలుముకుంటయ్. రైతులు మళ్లీ మొదటికొచ్చి, నిద్రలేని రాత్రులు గడపాల్సిందే. కాంగ్రెసోళ్లకు రైతులంటే గిట్టదు. అందుకే మాకు ఇబ్బంది తెచ్చే ఆలోచనలే చేస్తున్నరు. ప్రతిఒక్కరూ ఆలోచించాలి. గత కాంగ్రెస్ పాలనలో ఎట్లుంటిమి, ఇప్పుడెట్లున్నమని ఒకసారి ప్రశ్నించుకుంటే మనకే అర్థమైతది.
– దండుచిన్న లింబయ్య, రైతు, ఆలూర్
సోన్, నవంబర్ 24 : తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా పచ్చదనం అలుముకుంది. 24 గంటల కరెంటు ఇవ్వడంతో గుంట భూమి ఇడ్సపెట్టకుండా ఎవుసం చేసుకుంటున్నం. కానీ, రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు అంటున్నాడు. ఇగ రానున్న రోజుల్లో రైతులు ఎవుసం చేసేకంటే ఇంటికాడనే కూర్చొనే రోజులు వస్తయ్. మూడు గంటల్లో పారుకం దిగదు. ఇది కాంగ్రెసోళ్లకు తెలియదునుకుంట. కేసీఆర్ సార్ రైతుల బాధ అర్థం చేసుకొని, ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తుండడం వల్ల పంటలను పండించుకుంటున్నాం. ఈ మూడు గంటల లొల్లి వద్దు, 24 గంటల కరెంటే ముద్దు.
– రవి, రైతు, లంగ్డాపూర్
నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 24 : బీఆర్ఎస్ పాలనలో కరెంటు కష్టాలు లేనే లేవు. మా మండలంలో ఇంతకుముందు సబ్స్టేషన్లు లేవు. కానీ, తెలంగాణ అచ్చినంక సబ్స్టేషన్లు వచ్చినయ్. అవసరమున్న చోట ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడూ కరెంటు మోటర్లు కాలిపోతుండే. ఉన్న ఆ కాస్త కరెంటు కూడా ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వని పరిస్థితి ఉండేది. పంటలు ఎండిపోయేటివి. ఇప్పుడు కాంగ్రెసోళ్లు చెప్పే మాటలు చూస్తుంటే మళ్లా ఆ పరిస్థితి తీసుకచ్చేటట్టు మాట్లాడుతున్నరు. కాంగ్రెసోళ్లకు ఓటేస్తే కష్టాలు తెచ్చుకున్నట్లే.
– మైస చిన్న గంగు, మహిళా రైతు, సిద్ధ్దాపూర్
దిలావర్పూర్, నవంబర్ 24 : కాంగ్రెస్ పాలన గురించి మా తాతలు, మా తండ్రి చెప్పిన్రు. ఆ పార్టీ నాయకులు చెప్పే మాటలు నమ్మం. సచ్చినా ఆ పార్టీకి ఓటేసేది లేదు. ఎవుసానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చి వృథా చేస్తున్నాడని ఆ పార్టీ నాయకులు అనడం సిగ్గు చేటు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంకనే మా రైతుల ముఖాల్లో సంబురం కన్పిస్తున్నది. ఇప్పుడు 10 హెచ్‌పీల మోటర్లతో 3 గంటల కరెంట్ సరిపోతదని అంటున్నరు. రైతులంతా ఓకేసారి మోటర్లు పెడితే ట్రాన్స్పార్మర్లు పేలిపోయి, సబ్స్టేషన్లు కాలిపోతయ్. మూడు గంటల కరెంట్ వద్దు.. మాకు కేసీఆర్ పాలనే ముద్దు.
– దనే రవి, రైతు