సారంగాపూర్, జూలై 23 : పండ్ల తోటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రైతులను పండ్ల తోటల పెంపకం వైపు దృష్టి మళ్లించడానికి రాయితీ (సబ్సీడీ)లను అందిస్తున్నది. ప్రతి మొక్కకు నీటి అందించేందుకు సబ్సిడీపై సూక్ష్మ సేద్య పరికరాలను ఇస్తున్నది. ప్రస్తుతం అనేక మంది పౌష్టికాహార లోపంతో వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి కారణం సమతుల్య ఆహారం లభించక పోవడం. సమతుల్య ఆహారంలో విటమిన్లు, ఖనిజ పోషకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అన్ని రకాల విటమిన్లు, ఖనిజ పోషకాలు ప్రకృతిలో పండ్లు, కూరగాయల నుంచి లభిస్తాయి. పండ్లు, కూరగాయల ధరలు ప్రస్తుతం ఆకానంటుతున్నాయి. వివిధ రకాల పండ్లను అన్ని వర్గాల ప్రజలు కొని తినలేని పరిస్థితితులు నెలకొన్నాయి. దీనిని సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టింది.
ఉపాధిహామీతో అనుసంధానం..
పండ్ల తోటలు పెంచడం చాలా ఖర్చుతో కూడుకున్నది. అన్ని వర్గాల రైతులు వీటిని పండించడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యానవనశాఖ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మామిడి, జామ, సీతాఫలం, బత్తాయి, సపోట, కొబ్బరి, యాపిల్, దానిమ్మ, మునగతో పాటు ఇతర తోటలను పెంచవచ్చు. ఈ సంవత్సరం నుంచి డ్రాగన్ ఫ్రూట్ కూడా ఈ పథకంలో చేర్చారు. పండ్ల తోటల పెంపకానికి బిందు సేద్యం పరికరాలను రాయితీపై ప్రభుత్వం అందిస్తున్నది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ పథకం జాబ్‌కార్డు, నీటి వసతి కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, చిన్నకారు, సన్నకారు రైతులు అర్హులు. ప్రతి రైతుకు ఐదెకరాల వరకు రాయితీ వర్తిస్తుంది. డ్రాగన్ ప్రూట్‌కు ప్రతి రైతులకు 0.5 ఎకరం వరకు 900 మొక్కలు రూ.2.75 లక్షల రాయితీ ఇస్తారు. నిర్మల్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 1,004 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. భూసార పరీక్ష, గుంతలు తీయడం, మొక్కలు నాటడం, మొక్కల కొనుగోలుకు రాయితీని ప్రభుత్వం అందిస్తున్నది. ఎరువులపై ఒక్క మొక్కకు రూ.50 చొప్పున మూడు సంవత్సరాల వరకు, వాచ్వార్డు కోసం ఒక మొక్కకు ఒక నెలకు రూ.10 చొప్పున మూడు సంవత్సరాల వరకు రాయితీని ప్రభుత్వం ఇస్తున్నది. బిందు సేద్యం పరికరాలపైన ఎస్సీ, ఎస్టీలకు 90శాతం రాయితీ ఉంటుంది.
31 లోపు దరఖాస్తు చేసుకోవాలి..
పండ్ల తోటలు పెంచాలని ఆసక్తి ఉన్న రైతులు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఐదు ఎకరాల్లోపు భూమి, నీటి వసతి, ఉపాధిహామీ జాబ్‌కార్డు కలిగిన ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు రైతులు అర్హులు. ప్రతి రైతుకు ఐదెకరాల వరకు రాయితీ వర్తిస్తుంది. ఈ సంవత్సరం నుంచి కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులు పండ్ల తోటల సాగుకు ముందుకు రావాలి.
– అలియా ఫాతిమా బేగం, ఇన్చార్జి ఉద్యానవన శాఖ అధికారి, నిర్మల్ జిల్లా