మంచిర్యాల, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గిరిబిడ్డలకు విద్య అందని ద్రాక్షగా మారింది. ఆ శ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్(సీఆర్టీలు) 8 రోజులుగా సమ్మె చేస్తుండగా, చదువులు సాగక విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నది. పరీక్షలు సమీపిస్తున్న వేళ తరగతుల నిర్వహణకు బ్రేక్ పడడంతో పాస్ అవుతామో.. లేదోనన్న బెంగ పట్టుకున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 654 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపు 48 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం సీఆర్టీలు సమ్మెకు దిగడంతో తరగతులు కొనసాగడం లేదు. ఈ పాఠశాలలన్నీ తాళం వేసి ఉంటుండగా, స్కూల్‌కు వచ్చిన గిరిజన విద్యార్థులు ఉపాధ్యాయల కోసం ఎదురుచూసి వెనుదిరిగిపోతున్నారు. కొన్ని స్కూళ్లలో పిల్లలు కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్లిపోతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టగా, ప్రస్తుతం ఒక్కో పాఠశాలలో ఒకరిద్దరు ఉపాధ్యాయులే పాఠాలు బోధిస్తున్నారు. అన్ని సజ్జెక్టులు బోధించే సిబ్బంది విధులకు హాజరుకాక ఉన్న రెగ్యులర్ ఉపాధ్యాయులు నానా తంటాలు పడాల్సి వస్తున్నది. పిల్లలందరినీ ఒకేదగ్గర చేర్చి చదివించడం తప్ప ఏం చేయలేకపోతున్నారు. మా సబ్జెక్ట్ అంటే చెబుతాం కానీ.. అన్ని సబ్జెక్టులు బోధించడమెలాగని పేర్కొంటున్నారు. పదో తరగతి పరీక్షల్లో ఆశ్రమ పాఠశాలలు కొన్నేళ్లుగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులకు మంచి గ్రేడ్లు వస్తున్నాయి. ఉత్తీర్ణత శాతంలోనూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గిరిజన పాఠశాలలు సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు పదో తరగతితో పాటు మిగతా పరీక్షలు దగ్గర పడుతున్నాయి.
ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఆర్టీల సమ్మెతో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా పాఠశాలలు దాదాపు 70 శాతం నుంచి 80 శాతం సీఆర్టీలపైనే ఆధారపడి నడుస్తున్నాయి. రెగ్యులర్ ఉపాధ్యాయులు 20 శాతం కూడా లేరు. ఈ నేపథ్యంలో సీఆర్టీల సమ్మెతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చదవలేని పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన సమయంలో టీచర్లు సమ్మెలో ఉండడం ఫలితాలపై ప్రభావం చూపనున్నది. అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో 46 గిరిజన ఉన్నత పాఠశాలలుండగా, 13 పాఠశాలల్లో ఒకరిద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులే విధుల్లో ఉన్నారు. మిగిలిన వారంతా సమ్మెలో ఉన్నారు. నిర్మల్ జిల్లాలో 11 పాఠశాలలు, మంచిర్యాలలో 16 పాఠశాలలు, ఆదిలాబాద్‌లోని కొన్ని స్కూళ్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పదో తరగతి విద్యార్థులతో పాటు మిగిలిన విద్యార్థులపైనా తీవ్రమైన ప్రభావం పడుతున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో పని చేసే సీఆర్టీలు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీ నుంచి ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్నారు. దాదాపు ఎనిమిది రోజులుగా టీచర్లు సమ్మెలో ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అధికారంలోకి రాకముందు మా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కరూ ఇప్పుడు పట్టించుకోవడం లేదని సీఆర్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 12 మంది గిరిజన ఎమ్మెల్యేలుంటే ఏ ఒక్కరూ అసెంబ్లీలో మా సమ్మె గురించి ప్రస్తావించడం లేదని వాపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు మా సమస్యను ప్రస్తావించారని.. దానిపై ప్రభుత్వ పెద్దలు అసలు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని లేనిపక్షంలో ప్రత్యేక కార్యాచరణ ప్రకటించి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల మంది సీఆర్టీలు ఈ నెల 16 నుంచి సమ్మెలో ఉన్నారు. 8 రోజులవుతున్నా అధికారులు స్పందించడం లేదు. అన్ని డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేశారు. మా డిపార్ట్మెంట్లో ఎందుకు చేయడం లేదని అడుగుతున్నాం. రాష్ట్రంలో రెండు వేల మంది ఉంటే.. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 1200 మంది సీఆర్టీలు ఉన్నారు. మాకు న్యాయం చేయాలి. మా డిమాండ్లను పరిగణలోకి తీసుకొని పరిష్కారం చూపాలి. గవర్నమెంట్ చర్చలకు రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం పూనుకుంటాం.
– జాదవ్ వినంత్రావు, సీఆర్టీ, రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు