మంచిర్యాల, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు సంక్షోభ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారాయి. భారీ వర్షాలు, వరదలు అన్నదాతలను నష్టాల ఊబిలో ముంచేశాయి. గోదావరి, ప్రాణహిత వరదల దాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు నీట మునిగాయి. అవసరం లేని సమయంలో కురిసిన భారీ వర్షాలు పంటలను కోలుకోలేని దెబ్బతీశాయి. పత్తి, సోయా, వరి పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. పత్తి, సోయా పంటలకు తెగుళ్లు సోకాయి. పూత, కాత ఆశించిన స్థాయిలో రాలేదు. పత్తి నల్లబడి మురిగింది. దీంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎదుగుదల లేకుండా పోయిన పంటలకు యూరియా వేద్దామంటే సమయానికి దొరకలేదు.
యూరియా కొరత రైతులకు శాపంగా మారింది. రోజుల తరబడి తిరిగిన, పొద్దు న లేచింది మొదలు సాయంత్రం వరకు కేంద్రాల ముందు పడిగాపులు కాసిన యూరియా దొరకలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొన్నటి వరకు ఎ క్కడ చూసినా యూరియా కోసం బారులుదీరిన రైతులే కనిపించారు. సరైన సమయంలో యూరి యా చల్లకపోవడంతో పంట ఎదుగుదల లోపించింది. దీంతో పంటలన్నీ చీడ, పీడలు పట్టాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, యూరియా కొరత ఈ సీజన్లో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టాయి.
వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పరిహారం రాలేదు. అసలు వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన పంటల వివరాలు అధికారులు నమోదు చేయలేదు. దీంతో పరిహారం వస్తుందో రాదో తెలియక మరోవైపు దిగుబడి తగ్గిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ సీజన్లో 17 లక్షల ఎకరాల్లో వివిధ రకాలు పంటలు సాగవగా.. అధిక వర్షపాతం కారణంగా రూ.4వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
పత్తి, సోయా పంటలకు తీవ్రనష్టం
అధిక వర్షంతో పత్తి, సోయా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లాలో 10.61 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. దాదాపు 1.76 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేశారు. పత్తి చెట్లు ఏపుగా పెరిగి పూ త, కాత వచ్చే సమయంలో కురిసిన వర్షాలు పంట ను దెబ్బతీశాయి. ఏపుగా పెరిగిన చెట్లకు తెగుళ్లు వచ్చాయి. దీంతో దిగుబడి తగ్గిందని రైతులు చెప్తున్నారు. పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఎకరా పత్తికి 8 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా… ఈ సీజన్లో ఐదు క్వింటాళ్లు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. వచ్చిన కాస్త పత్తితో నల్లబడిన పత్తి ఎక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు.
పత్తి పంట తర్వాత అధిక నష్టం వాటిళ్లనున్నది సోయా పంటే అని రైతులు చెప్తున్నారు. కాత దశలో కురిసిన భారీ వర్షాలతో దిగుబడి భారీగా తగ్గిపోనున్నది. ఎకరా సోయా పంటకు ఆరు క్వింటాళ్ల నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఈ సీజన్లో నాలుగు నుంచి ఐదు క్వింటాళ్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. వరి, మొక్కజొన్న, పప్పు దినుసులు మొదలైన ఇతర పంటల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నది. పత్తి పంట ఉత్పత్తులు దాదాపు రూ.3వేల కోట్లు, సోయా రూ.200 కోట్లు, ఇతర పంటలు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు దిగుబడి నష్టపోవచ్చని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రానున్న సీజన్లో రైతులకు వ్యవసాయం గుదిబండలా మారొచ్చనే అభిప్రాయపడుతున్నారు. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఆదుకోవడంతోపాటు దిగుబడి తగ్గిపోనున్న నేపథ్యంలో మద్దతు ధర మరింత పెంచి పంటలు కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి సాయం రాకుంటే నష్టాల ఊబిలో మునిగిపోతామని వాపోతున్నారు.
రెండెకరాల్లో పత్తి పూర్తిగాపాడైపోయింది..
ఐదెకరాల్లో పత్తి సాగు చేశా. గోదావరి పక్కన ఉన్న రెండెకరాలు మొత్తం నీటమునిగి పంట మురిగింది. అవి ఎందుకు పనికి రాని పరిస్థితి. అధికారులు వచ్చి వివరాలు రాసుకొని వెళ్లారు. కానీ.. ఇప్పటి వరకు పరిహారం రాలేదు. ఇప్పటికైనా పరిహారం చెల్లించి ఆదుకోవాలి. మిగిలిన మూడెకరాల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చేలా కనిపించడం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. రైతులు నష్టాల బారిన పడకుండా ప్రభుత్వమే ఆదుకోవాలి.
– రాగం కొమురయ్య, టేకుమట్ల
వర్షాలు ఎక్కువై దెబ్బతిన్నయ్..
వర్షాలు అధికంగా పడి పంటలు దిబ్బతిన్నయ్. అవసరమైన దానికంటే ఎక్కువ వర్షాలు పడి పత్తికి తెగుళ్లు వచ్చాయి. పత్తి నల్లబడి మురిగింది. పంటపై పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆశించిన స్థాయిలో కాత, పూత రాలేదు. సగం దిగుబడి కూడా వచ్చేలా లేదు. అదే జరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తది. ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– కొట్రంగి ప్రకాశ్, కన్నెపల్లి