మంచిర్యాల, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి చేతికందకుండా పోయాయి. పలుచోట్ల పంటల నష్టంపై సర్వే పూర్తి చేసినా, ఇప్పటి వరకూ సర్కారు నుంచి ఎలాంటి సాయం అందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా మొద్దు నిద్ర వీడి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
మంచిర్యాల జిల్లాలో 16 వేల ఎకరాల్లో..
మంచిర్యాల జిల్లాలో 16 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహించగా, వాగులు, వంకలు ఉప్పొంగి పంటల్లోకి వరద వచ్చి చేరింది. అత్యధికంగా చెన్నూర్ నియోజకవర్గంలోని జైపూర్‌లో 2,725, చెన్నూర్‌లో 2,270, కోటపల్లిలో 1,035 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లిలో 2,219, వేమనపల్లిలో 1715 ఎకరాల్లో పంటలు చేతికందకుండా పోయాయి.
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో జన్నారం మండలంలో 340 ఎకరాల్లోకి వరద చేరి.. ఇసుక మేటలు వేశాయి. జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, మిర్చి తదితర పంటలు సాగు చేసిన 9,319 మంది రైతులు పంటలు నష్టపోవాల్సి వచ్చిందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. 6,594.07 ఎకరాల్లో వరి, 9,501 ఎకరాల్లో పత్తి, 40 ఎకరాల్లో మిర్చి, 22 ఎకరాల్లో కూరగాయలు, 40 ఎకరాల్లో జొన్న పంటలు నష్టపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
విపత్తుపై మొద్దు నిద్ర..
వర్షాలు, వరదలు కారణంగా నీట మునిగిన పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వరద విపత్తులు వచ్చిన ప్రతిసారీ పంట పరిహారం ఇచ్చారని, కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఇప్పటి దాకా పంట నష్టపరిహారంపై ఎలాంటి హామీ ఇవ్వలేదని మండిపడుతున్నారు. లక్షలాది రూపాయలు అప్పుతెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. రైతులు సైతం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రవీడకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరుతున్న కాంగ్రెస్ సర్కారు.. ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఎలాంటి పరిహారం ప్రకటించకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 6453 ఎకరాల్లో..
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కు మ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 6453 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అంతకుమించి(సుమారు 15 వేల ఎకరాలు) పంటలు కోల్పోయినట్లు తెలుస్తున్నది. వార్ధా నది బ్యాక్ వాటర్‌తో పా టు పెద్దవాగు, ఎర్రవాగు ఉప్పొంగడంతో పంటలు నీట మునిగాయి. ప్రధానంగా సిర్పూర్-టీ, దహె గాం, కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో పం టలకు నష్టం వాటిల్లింది.
ఒక్క దహెగాం మండలంలోని ఇట్యాల, బీబ్రా, పంబాపూర్, లగ్గాం, ద హెగాం, ఒడ్డుగూడ, అమరగొండ, గెర్రె, కర్గి, మొ ట్లగూడ, రాంపూర్, దిగిడ గ్రామాల పరిధిలో సు మారు 5వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింద ని అంచనా. ప్రాణహిత, వార్ధా నదుల బ్యాక్ వాటర్‌తో పెంచికల్పేట్ మండలంలోని కమ్మర్గాం, ము రళీగూడ, జిల్లెడ, నందిగామ, వడ్డెపల్లి, అగర్‌గూడ, గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
మంత్రి జూపల్లి సమీక్షించినా..
జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పంటల నష్టంపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. పంటలు కోల్పోయిన వారికి ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. పక్షం రోజులు దాటినా నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
రాసుకొని పోతున్నరు
నేను ఆరెకరాల్లో పత్తి పెట్టిన. వర్షాలకు గంగ ఉప్పొంగి నాలుగెకరాల పంట మునిగిపోయి మురిగిపోయింది. సార్లు ఇయ్యాల వచ్చి రాసుకుంటున్రు. ఆధార్‌కార్డు, పాసుబుక్కు జిరాక్స్‌లు తీసుకున్నరు. రూ.1.60 లక్షల దాకా మునిగినట్లే. ఇగ సర్కారోళ్లు ఏం చేస్తరో చూడాలి.
– బద్రి బాపు, బెజ్జాల
గంగొచ్చి రెండెకరాల పత్తిని ముంచింది
ఇటీవల పడ్డ వర్షాలకు గంగొచ్చి రెండెకరాల పత్తిని ముంచింది. అధికారు లు వచ్చి రాసుకున్నరు. ఆధార్‌కార్డు, భూమి పాస్‌బుక్‌లు తీసుకొని పోయిన్రు. రెండెకరాలకు రూ. 80 వేల దాకా మునిగిన. ప్రభుత్వం స్పందించి మమ్ముల ఆదుకోవాలి. – రాగం కొమురయ్య, టేకుమట్ల
పరిహారమిచ్చి ఆదుకోవాలి
పదెకరాల్లో పత్తి వేసిన. ఇటీవలి వర్షాలకు ఆరెకరాల్లో పంట నీట మునిగింది. పంటల కోసం రూ. నాలుగు లక్షల దాకా ఖర్చు చేసిన. ఇప్పటికైతే ఎవ్వరూ రాలే. పంటనష్టం సర్వే చేయలే. అధికారులు పంట నష్టాన్ని అంచనావేసి పరిహారం ఇయ్యాలి.
– ఆవిడపు రాజేశం, టేకుమట్ల
గిట్లయితదనుకోలే
వర్షాలకు పెన్‌గంగ ఉప్పొంగి నాకున్న ఎకరం పత్తి పంటను ముంచింది. రూ.25 వేల దాకా పెట్టుబడి పెట్టిన. పత్తి పంట మంచిగుండే. గిట్లా చేతికి రాకుండా పోతుందని అనుకోలే. ప్రభుత్వమే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– పాల్ రావోజీ, నవేగాం (సిర్పూర్-టీ)
4 ఎకరాల్లో పత్తి నల్లబడిపోయింది
మాకున్న ఆరెకరాల్లో పత్తి వేసిన. ఎకరానికి రూ. 25 వేల దాకా ఖర్చు చేసిన. వర్షాలకు వరదంతా వచ్చి చేనులో నిలిచింది. సుమారు 4 ఎకరాల్లో పంట పాడైంది. మొత్తం నల్లబడిపోయింది. గిప్పటి దాకా అసలు సర్వే చేయలే.. ఇంకెప్పుడు సర్వే చేస్తరో.. పరిహారం ఎప్పుడిస్తరో..
– సంధ్యాబాయి, హుడ్కిలి (సిర్పూర్-టీ)