జన్నారం, ఏప్రిల్ 9 : కడెం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ-22 కాలువపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతాంగానికి చివరకు నిరాశే మిగులుతున్నది. సకాలంలో నీరందించకపోగా, కష్టనష్టాలకోర్చి సాగు చేసిన వరి, మక్క చేతికందకుండాపోయే పరిస్థితి దాపురించింది.
కాంగ్రెస్ పుణ్యమాని..
తిమ్మాపూర్ గ్రామంలో కొమురయ్య 4 ఎకరాల్లో వరి, దాడి తిరుపతి 3 ఎకరాల్లో వరి, కుదురపాక శంకరి 2 ఎకరాల్లో మక్క, జునుగూరి మల్లయ్య 2 ఎకరాల్లో వరి సాగు చేశారు. పంటలు చేతికొచ్చే సమయంలో కడెం కెనాల్ నీరు వదలకపోవడం.. బోర్లు.. బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి.
లక్షలాది రూపాయలు పె ట్టి బావులు తవ్వించినా ఫలితం లేకుండా పోతుందని, రెండు పం టలకు నీరందిస్తామన్న అధికారుల మాటలు నమ్మి తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, ప్రస్తుత సర్కారు పుణ్యామాని పంటలు చేతికందకుండా పోతున్నాయని వాపోతున్నారు. ఎండిన పంటలు సర్వేచేసి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
నష్టపరిహారమివ్వాలి
కడెం డిస్ట్రిబ్యూటరీ కాలువ-22 కింద మూడెకరాల వరి వేసిన. అధికారులు నీళ్లిస్తమని చెప్పడంతో నమ్మి పంట వేసిన. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. మాకున్న బావిలో కూడా నీళ్లు అడుగంటినయి. రూ. లక్ష పెట్టి పూడిక తీయించిన. అయినా నీళ్లు పడలేదు. కండ్లముందే పంట ఎండిపోతుంటే గుండె తరుక్కపోతున్నది. సర్కారు స్పందించి నష్టపరిహారం అందించాలి.
– దాడి తిరుపతి, రైతు, తపాలాపూర్
కాంగ్రెస్ వచ్చి ముంచింది
కడెం ప్రాజెక్టు నుంచి సకాలంలో నీళ్లివ్వక నా రెండెకరాల వరి పంట ఎండిపోతున్నది. నీళ్లివ్వండి సారూ.. అని మస్తు సార్లు మొర పెట్టుకున్నం. పట్టించుకున్న పాపాన పోలేదు. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు గిసొంటి గోస రాలే. రంది లేకుంట పంట తీసిన. గీ కాంగ్రెస్ వచ్చి ముంచింది.
– జూనుగూరి మల్లయ్య, రైతు, తిమ్మాపూర్