మంచిర్యాల, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ రైతన్నలను నిండా ముంచింది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం పడగా, వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లాలో 2.7, మంచిర్యాల జిల్లాలో 2.3, నిర్మల్లో 1.9, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, మంగళవారం అర్ధరాత్రి నుంచే ఈదురు గాలులు మొదలుకాగా, బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ముసురుపడుతూనే ఉన్నది.
చెన్నూర్ పట్టణంలోని రోడ్లపై వరద ప్రవహించింది. మందమర్రి మండలం సారంగపల్లి, వేమనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి చేతికందకుండా పోయింది. నాగారం-మంగెనపల్లి మధ్యనున్న మట్టి రోడ్డు వర్షానికి బురదమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక జిల్లెడలో పత్తి రంగు మారి నేలరాలిపోతున్నది.