climate change | కుభీర్, ఆగస్టు 8: తరచూ వాతావరణంలో మార్పుల కారణంగానే రైతులు సాగు చేసుకున్న పంటలకు అధికంగా చీడపీడలు ఆశిస్తున్నాయని వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఎం నారాయణ రైతులకు సూచించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సోనాలి క్లస్టర్ లోని సొనారి, హంపోలి, గోడపూర్ తదితర గ్రామాలలో ఆయన పలువురి రైతుల పంట క్షేత్రాలకు వెళ్లి పత్తి, సోయా పంటలను రైతులతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
సోయబీన్ పంట లో వాతావరణం లో ఉష్ణోగ్రత మారడం వల్ల చీడపీడలు ఎక్కువగా ఆశించడం జరుగుతుందని, ముఖ్యంగా లద్దెపురుగు, పల్లాకు తెగులు, కాండంకుళ్లు తెగులు ఆశించి పంటలను నష్టం చేస్తున్నాయని రైతులకు సూచించారు. లద్దెపురుగు నివారణకు థాయోడికార్ప్ 1.5 గ్రా లీటర్ నీటికి, ఇమోమిక్టిన్ బింజొఇట్ 0.5 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని, కాయకుళ్లు నివారణకు టెబ్బుకోనాజోల్ మరియు సల్ఫార్ 2.5 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడంతో చీడపీడల నుంచి పంటలను రక్షించుకోగలుగుతామని సూచించారు.