తాండూర్, జూన్ 24: తాండూర్ మండలంలో రైతులు వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆకు కూరల సాగుపై దృష్టి పెట్టారు. మంచి లాభాలు వస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతో నీరు పుష్కలంగా చేరింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీళ్లు ఉన్నాయి. దీంతో పాటు ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉచితంగా నిరంతర విద్యుత్‌ను అందిస్తుండడంతో రైతులు కూరగాయలు, ఆకు కూరల సాగుకు ముందుకు వస్తున్నారు. మండలంలోని కొత్తపల్లి, అచ్చలాపూర్, కాసిపేట, ద్వారకాపూర్, తాండూర్, రేచిని, బోయపల్లి, బోయపల్లి బోర్డు, నీలాయిపల్లి గ్రామాల్లో రైతులు ఎక్కువగా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోనే కాకుండా పక్కనే ఉన్న కుమ్రంభీం జిల్లాలోని అంగళ్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు.
150ఎకరాలకు పైగా సాగు…
తాండూర్ మండలంలోని కొత్తపల్లి శివారులో దాదాపు 40 ఎకరాలకు పైగా, అచ్చలాపూర్ శివారులో 20 ఎకరాలు, కాసిపేట, ద్వారకాపూర్ గ్రామాల శివారులో దాదాపు 30 ఎకరాలు, తాండూర్, రేచిని, బోయపల్లి, బోయపల్లి బోర్డు, నీలాయిపల్లి శివార్లలో 60 ఎకరాల వరకు కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. సుమారు 100 కుటుంబాలు వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. బీర, దోస, సోరకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి, వంకాయ, టమాట, బెండకాయలతో పాటు తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, కొత్తిమీర, మెంతి, పుదీన, ఉల్లి ఆకు సాగు చేస్తున్నారు. తాండూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, గోలేటి, ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్‌నగర్ ప్రాంతాలకు ఆటోల్లో తీసుకెళ్లి విక్రయించి లాభాలు గడిస్తున్నారు.
ఎకరాన్నరలో సాగు చేశాం..
మాకు ఉన్న ఎకరాన్నర చెల్కలో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేశాం. ప్రస్తుతం పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు వేశాను. ప్రతి పంటపై దాదాపు రూ. 10వేల పెట్టుబడి పెట్టాను. ఇప్పటికే పలు మార్లు పంటలను కోసి సంతలో విక్రయించాం. మా కుటుంబ సభ్యులు, కూలీలతో కలిసి పని చేసుకుంటూ తోట చూసుకుంటున్న. నేను, నాకుటుంబ సభ్యులు కూరగాయలను ఆటోల్లో అంగళ్లకు తీసుకెళ్లి అమ్ముతుంటాం. తాజాగా ఉండడంతో ప్రజలు కొనేందుకు ఇష్టపడుతున్నారు. మంచి లాభాలు కూడా వస్తున్నాయి.
–బుద్దార్థి సునీత, మహిళా రైతు, కొత్తపల్లి, (తాండూర్)
బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి..
ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికతీయడంతో బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. నా చెల్కకు పక్కనే చెరువు ఉంది. మూడెకరాల చెల్కలో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్న. రోజూ మోటార్ సైకిల్, ఆటోల్లో అంగళ్లకు వెళ్లి కూరగాయలు అమ్ముకొని మధ్యాహ్నం వరకు ఇంటికి వస్తాను. ప్రస్తుతం పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్న. ప్రతి పంటపై మూడెకరాలకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ప్రతి పంటపై ఏడాదికి సీజన్‌ను బట్టి రూ. లక్ష పైనే వస్తాయి. పత్తి, వరి సాగుకంటే కూరగాయలు, ఆకుకూరల సాగే మేలు. ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంటలో లాభం వస్తుందన్న ధీమా ఉంటుంది.
–చీర్ల అశోక్, రైతు, కొత్తపల్లి, (తాండూర్)