తాండూర్ : అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంతో పంట పొలాల్లోకి బ్యాక్‌వాటర్ ( Back Water ) తో నిండి ఓ రైతు ఇబ్బందులపాలవుతున్నాడు. మంచిర్యాల జిల్లా తాండూర్ గ్రామపంచాయతీ పరిధి పోచమ్మ కుంట సమీపంలోని సర్వే నెంబర్ 400లో ఎండి దావూద్( MD Dawood) అనే రైతుకు చెందిన మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో మామిడి(Mango) , టేకు చెట్లు, మల్లెపూల తోటలు పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఇటీవల వరుసగా కురిసిన వర్షాలతో పోచమ్మ కుంట బ్యాక్ వాటర్‌తో నిండిపోయింది. దీంతో వ్యవసాయానికి సాగు చేయకుండా, మామిడి తోట కాపు కాయక, మల్లె తోట పూల పంట రాక తీవ్రంగా నష్టపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు సంవత్సరాల క్రితం మిషిన్ కాకతీయ పనుల్లో భాగంగా పోచమ్మ కుంట చెరువు మత్తడిని సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండానే చెరువు గుత్తేదారు మత్తడిని పెంచడంతో చెరువు బ్యాక్ వాటర్ వ్యవసాయ భూమిలో నీరు నిలిచి వ్యవసాయం సాగు చేయకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఈ విషయంపై పలుమార్లు అధికారుల దృష్టికి, సంబంధిత ఇరిగేషన్ అధికారుల దృష్టికి, ప్రజావాణిలో కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని అన్నారు. పోచమ్మ కుంట చెరువు మత్తడిని సామర్ధ్యానికన్నా మించి ఎత్తు పెంచడంతో సమస్య వస్తుందని అన్నారు.