శ్రీరాంపూర్, సెప్టెంబర్ 22 : సింగరేణి కార్మికవర్గాన్ని కాంగ్రెస్ సర్కారు మరోసారి మోసం చేసింది. లాభాల వాటా పెంచి 34 శాతం ఇచ్చినట్లు గొప్పలకు పోయిన ప్రభుత్వం సంస్థ అభివృద్ధి, విస్తరణ పేరిట రూ. 4 వేల కోట్లకు పైగా పక్కన పెట్టగా, నల్లసూరీలు పూర్తిస్థాయి వాటా పొందలేని పరిస్థితి నెలకొన్నది. గతేడాదికంటే రూ.1693 కోట్లు లాభాలు పెరిగినా, బోనస్ కేటాయింపు వాటాలో మాత్రం రూ.52 కోట్లు తగ్గించి ప్రకటించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. సింగరేణి-ప్రభుత్వం కలిసి తమ శ్రమను దోపిడీ చేస్తున్నాయని, ఇది లాభాల వాటా కాదు.. ముమ్మాటికీ బోగస్ వాటానేనంటూ అసహనం వ్యక్తం చేస్తున్నది.
అభివృద్ధి, విస్తరణ పేరిట..
సింగరేణి సంస్థకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను ఎట్టకేలకు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘం సెక్రెటరీ జనరల్ జనక్‌ప్రసాద్‌తో కలిసి ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరం రూ. 6394 కోట్ల నికర లాభాలు రాగా, అందులో నుంచి సంస్థ అభివృద్ధి, నూతన ప్రాజెక్టుల విస్తరణ పేరిట రూ. 4034 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. అన్నీ పోను రూ. 2360 కోట్ల లాభాలు వచ్చినట్లు వెల్లడించారు.
ఇందులో ఉద్యోగులకు 34 శాతం లాభాల వాటా(బోనస్) చెల్లించనున్నట్లు ప్రకటించారు. శాశ్వత కార్మికులకు రూ. 802.4 కోట్లు, కాంట్రాక్టు కార్మికులకు రూ. 16.6 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. మొత్తంగా అందరికీ కలిపి 819 కోట్ల బోనస్ చెల్లించడం జరుగుతుందని సీఎం ప్రకటించారు. కార్మికులకు వచ్చే నెల మొదటి వారంలో చెల్లించనున్నారు. కార్మికులకు సగటున రూ.1,95,610 అందుతాయని ప్రకటించారు. 41000 మంది సింగరేణి ఉద్యోగులకు వాటా అందనున్నది. గతేడాదితో పోల్చితే కార్మికులకు రూ.8,289 మేర బోనస్ అదనంగా లభిస్తున్నది. కాంట్రాక్టు కార్మికులకు గతేడాది రూ.5000 చెల్లిస్తే ఈ ఏడాది 5500 చెల్లిస్తున్నారు.
లాభాలు తక్కువ చూపడంపై కార్మికుల ఆగ్రహం
2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభాలను తక్కువగా చూపి కార్మికులను ప్రభుత్వం మరోమారు మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కలిసి కార్మిక వర్గాన్ని దగాచేసి నయవంచనకు గురిచేసిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాదిలాగే అభివృద్ది పేరిట, విస్తరణ పేరుతో ప్రభుత్వం, యాజమాన్యం నిధులు మళ్లిస్తుందని వాపోతున్నారు. 2023-24 సంవత్సరానికి వాస్తవ లాభాలు రూ. 6394 కోట్ల నికర లాభాల్లో నుంచి రూ. 4034 కోట్లు పక్కన పెట్టారు. నికర లాభాల(అన్ని పనులు పోగా) నుంచి తిరిగి కంపెనీ భవిష్యత్ కోసమని ప్రకటించడంపై కార్మికుల్లో అనుమానాలు.. ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మిగతా రూ. 2360 కోట్ల మీద 34 శాతం అని చెప్పి.. రూ. 819 కోట్లు మాత్రమే చెల్లించడం అన్యాయమంటున్నారు.
న్యాయపోరాటం చేస్తాం..
సింగరేణి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అంకెల గారడీ చూపించింది. అందుకే అన్ని ఆడిట్ షీట్లు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు స్వయంగా సీఎం, డిప్యూటీ సీఎం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకుల సమక్షంలో మోసాన్ని బయటపెట్టారు. దీనిపై టీబీజీకేఎస్ కార్మిక వర్గాన్ని చైతన్య పరిచి న్యాయ పోరాటం చేస్తుంది.
– కే సురేందర్‌రెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి
నమ్మించి మోసం చేస్తున్నారు..
నికర లాభాల్లో కార్మికులకు వాటా సాధించడంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు విఫలమవుతున్నాయి. గతేడాది రూ. 2412 కోట్ల లాభాలు వచ్చాయని, ఈ ఏడాది రూ. 2360 లాభాలు చూపడంపై కార్మికులకు అన్యాయం చేయడమే. రూ. 52 కోట్ల లాభాలు తక్కువగా చూపి అన్యాయం చేస్తున్నారు.
– అందె రమేశ్, జనరల్ అసిస్టెంట్, శ్రీరాంపూర్
ప్రభుత్వం కోట్లు దోచుకుంటున్నది
సింగరేణి సంస్థ లాభాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు దోచుకుంటున్నది. యూనియన్లు రాజకీయ ప్రచారం చేసుకోవడానికి సింగరేణిని వేదికలా ఉపయోగించుకుంటున్నాయి. సంస్థ లాభాలు ప్రభుత్వం వద్ద రూ. 43 కోట్లు ఉండగా, మళ్లీ సంస్థ లాభాల్లో నుంచి వేల కోట్లు పక్కనపెట్టుడేమిటో అర్థం కావడం లేదు. నిల్వ లాభాల్లో నుంచి సంస్థ అభివృద్ధికి, నూతన ప్రాజెక్టులకు ఉపయోగించాలి. ప్రభుత్వం సింగరేణి నిధులను వినియోగించుకోవడం సరికాదు.
– చంద్రశేఖర్, కోల్‌కట్టర్, శ్రీరాంపూర్
ఇది బోగస్ వాటా..
సింగరేణి, ప్రభుత్వం కలిసి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయి. ఇది లాభాల వాటా కాదు. బోగస్ వాటా. కార్మికులను మోసం చేసిన యూనియన్లకు రానున్న రోజుల్లో పుట్టగతులుండవు. గతేడాదికంటే ఉత్పత్తి, లాభాలు పెరిగినా కార్మికుల వాటాకు ఎగనామం పెడుతున్నారు. కార్మిక సంఘాల లొంగుబాటుపై కార్మికులు మండిపడుతున్నారు.
– బండి కుమారస్వామి, కోల్‌కట్టర్, శ్రీరాంపూర్