ఆదిలాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరైంది. దీంతో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు, పురుగులు మందు తాగిన వారు, గుండెపోటు బాధితులకు సేవలు అందుతాయి. రిమ్స్ ఆవరణతో నిర్మించనున్న ఈ యూనిట్ పనులు టీఎస్ఎంఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆ ప్రదేశంలో క్యాంటిన్, మందులు పంపిణీ కేంద్రం ఉండగా వాటిని ఇతర ప్రాంతాలకు తరలించారు. రూ.23 కోట్లు మంజూరు కాగా.. రూ.12.79 కోట్లతో భవనం, రూ.10.21 కోట్లతో పరికరాల కోసం వెచ్చిస్తారు.
మెరుగైన వైద్య సేవలు
కేసీఆర్ ప్రభుత్వం జిల్లావాసులకు ఉచిత వైద్యసేవలు అందించడానికి పకడ్బందీ చర్యలు చేపట్టింది. రిమ్స్‌తోపాటు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది నియామకం చేపట్టింది. అన్ని రకాల మందు లు అందుబాటులో ఉంచడంతోపాటు టీ-డయాగ్నోస్టిక్ కేంద్రంలో 52 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు ఫలితంగా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా లో 80 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారి 44తోపాటు ఇతర రోడ్లపై ప్రమాదాలు జరుగుతుంటాయి. క్షతగాత్రులను రిమ్స్‌కు తీసుకొస్తారు. ఇక్కడ చికిత్స అనంతరం హైదరాబాద్, నాగ్‌పూర్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్తారు. రెండు పట్టణాలకు వెళ్లాలంటే నాలుగైదు గంటల సమయం పడుతున్నది. దీంతో అత్యవసర సమయాల్లో సరైన వైద్యసేవలు అందక ప్రాణాలు పోతున్నాయి. క్రిటికల్ కేర్ సెంటర్ ఫలితంగా ఎమర్జెన్సీ సేవలు స్థానికంగా అందుతాయి.
అత్యవసర సేవలు అందుతాయి..
రిమ్స్‌లో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ వల్ల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రమాదాల బారిన పడి గాయపడిన వారు, పురుగుల మందు తాగిన వారితోపాటు ఇతర కారణాలతో ప్రాణపాయ స్థితిలో వచ్చిన వారికి ఇక్కడే మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఇందులో వైద్యనిపుణులు, సిబ్బంది నియమిస్తే ప్రయోజనం ఉటుంది.
– జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్