బెల్లంపల్లి, ఏప్రిల్ 9 : కేంద్రప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐ నాయకులు భగ్గుమన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బెల్లంపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ, పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ కేంద్రం వంట గ్యాస్ సిలిండర్‌పై అదనంగా రూ.50 పెంచడం దారుణమన్నారు. కార్పొరేట్ కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తలకు రూ. లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ పేదలపై పెనుభారం మోపుతుందని మండిపడ్డారు.
ఆందోళనతో మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, నాయకులు కొంకుల రాజేశ్, గుండా చంద్రమాణిక్యం, గుండా సరోజ, కొండు బానేశ్, బొల్లం సోనీ, రత్నం రాజం, బొల్లం తిలక్ అంబేద్కర్, ఉప్పులేటి శంకర్, గోలేటి రాయలింగు, బండారి శంకర్, కెమెరా దుర్గయ్య, రాధాకృష్ణ, కుందేళ్ల శంకర్, అందుగుల రాజేందర్, అంబాల ప్రభుదాస్, తిప్పారపు శంకరయ్య పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌లో ఖాళీ సిలిండర్లతో నిరసన..
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఏప్రిల్ 9 : గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోట శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తాలో సీపీఎం నాయకులతో కలిసి ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఓ వైపు అంతర్జాతీయ మారెట్లో ముడి చమురు ధరలు తగ్గుతుంటే.. మన దేశంలో మాత్రం ధరలు పెరగడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కమిటీ సభ్యులు కార్తీక్, మాల శ్రీ, టీకానంద్, శ్రావణి ఉన్నారు.