మంచిర్యాల జిల్లాకు చెందిన గునుగుంట్ల వీరమణికంఠ, ముండ్రు మల్లికార్జున్, కోటా సాంబశివరావులు పల్నాడు జిల్లాకు చెందిన గండవల్ల శ్రీరంగతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామానికి చెందిన పెండ్యాల జగదీశ్వర్‌రావు వద్ద నకిలీ విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేశారు. ఆ విత్తనాలను తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తుండగా మే 25వ తేదీన నల్గొండ జిల్లా ఈదులగూడెం కూడలి పోలీసు పట్టుకున్నారు. ఈ క్రమంలో గండవల్ల శ్రీరంగ విత్తన ప్యాకెట్లను వదిలిపెట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో రూ.5 లక్షల విలువ గల 2.60 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. నిందితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంచిర్యాల, జూన్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో పట్టుబడుతున్న నకిలీ విత్తనాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో సంబంధం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా.. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లినా.. ఇలా ఏ ఘటన చూసుకున్నా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఈ దందాల్లో కీలక సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. సీజన్‌కు ముందే అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఈ విత్తనాలు జిల్లాకు చాటుగా చేరుకున్నాయి. సీజన్ ముందే నకిలీ విత్తనాలు జిల్లాకు వచ్చాయంటూ ‘నమస్తే తెలంగాణ’ గతంలోనే కథనాలను ప్రచురించింది.
ఫిబ్రవరిలోనే మంచిర్యాల జిల్లా భీమిని మండలానికి వచ్చాయని.. దాదాపు 20 క్వింటాళ్లను పోలీసులే కావాలని తప్పించారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. దీనిపై విజిలెన్స్, ఇంటెలిజెన్స్ విచారణ కూడా సాగింది. ఉమ్మడి జిల్లాలో సాగయ్యే పత్తిలో దాదాపు 50 నుంచి 60 శాతం వరకు నకిలీ విత్తనాలే ఉంటాయంటే.. మన వద్ద దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన కొందరు వ్యాపారులతో చేతులు కలిపిన జిల్లావాసులు అక్కడి నుంచి నకిలీ విత్తనాలు తెచ్చి విక్రయిస్తున్నారు. ఇక్కడి నుంచే మహారాష్ట్రకు కూడా తరలిస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి రెండు, మూడు నెలల క్రితమే విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి.
క్వింటాళ్ల కొద్ది విత్తనాలు వస్తే అధికారులు పట్టుకునేవి మాత్రం కిలోల్లో ఉంటున్నాయి. సీజన్‌కు ముందే టాస్క్‌పోర్స్ కమిటీలు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పక్క జిల్లాల్లో మన జిల్లాకు వచ్చే నకిలీ విత్తనాలను క్వింటాళ్ల కొద్ది పట్టుకుంటుంటే.. మన జిల్లాలో మాత్రం కిలోల్లోనే ఉంటున్నాయి. పక్క రాష్ర్టాలకు మన దగ్గరి నుంచి వెళ్లే విత్తనాలను పట్టుకుంటున్న అధికారులు.. మన మార్కెట్లో నకిలీ విత్తనాలను అరికట్టడంలో విఫలమవుతున్నారే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం రైతులు క్యూలు కట్టి రోజుల తరబడి ఎదురు చూస్తుంటే.. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో విత్తన షాపుల వైపు చూసే నాథుడే కరువయ్యాడు. అంటే ఆ స్థాయిలో ఈ రెండు జిల్లాల్లో నకిలీ విత్తనాలు రైతులకు దొరుకుతున్నాయి. ఈ జిల్లాల్లో దుక్కులు దున్ని సాగుకు సిద్ధమైన రైతుల వద్ద దాదాపు 50 శాతం మంది వద్ద నకిలీ విత్తనాలే ఉన్నాయని తెలుస్తున్నది. ఇంత జరుగుతున్నా అధికారులు అడ్డుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతి ఏడాది దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు నకిలీ విత్తన దందా చేసే కేటుగాళ్లు వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ అధికారులకు మామూళ్ల రూపంలో ముట్టజెపుతారనే ఆరోపణలు ఉన్నాయి. మందమర్రిలో నకిలీ విత్తనాల సరఫరా కేసులో పోలీసులు పట్టుకున్న ఓ వ్యక్తి స్వయంగా ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తున్నది. అధికారి స్థాయిని అనుసరించి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముట్టజెపుతారని తెలుస్తున్నది.
గత సీజన్లో నకిలీ విత్తన దందా చేసే వాళ్లు తనకు రూ.3.50 లక్షలు ఇచ్చారని, ఈ సారి అంతకంటే ఎక్కువ ఇస్తారనుకుంటున్నట్లు మంచిర్యాల జిల్లాలోని ఓ మండలంలో పని చేసే వ్యవసాయ అధికారే స్వయంగా చెప్పారు. ఆయన మాటలను బట్టి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో నకిలీ విత్తనాల దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు ఏర్పాటు చేశాం. మండల ఎస్ఐ, అగ్రికల్చర్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్ ఈ టీమ్‌లో ఉంటారు. ఇప్పటివరకు జిల్లాలో ఐదు కేసులు నమోదు చేశాం. చెన్నూర్‌లో ఒకటి, భీమిని మండలంలో నాలుగు కేసులు అయ్యాయి. డీలర్లు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే నకిలీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– సురేఖ, వ్యవసాయ అధికారి, మంచిర్యాల జిల్లా.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ఏరియాలో గల రాంనగర్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ బ్యాక్ సైడ్‌లో ఉన్న గోదాంలో నకిలీ విత్తనాలను ప్యాక్ చేస్తున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. లక్షల రూపాయల విత్తనాలు, ప్యాకెట్లను సీజ్ చేశారు. మీనాక్షీ, పాండురంగ, బోల్‌గార్డ్, జే 15, పుడమి వంటి బ్రాండెడ్ కంపెనీల పేరిట ప్యాక్ చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్రకు ఈ విత్తనాలను తరలించేందుకు సదరు ముఠా సిద్ధమైనట్లు గుర్తించారు. ఈ వ్యవహారానికి కీలక సూత్రధారైన అశోక్‌రెడ్డి సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.