ఆదిలాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తి సీజన్‌కు ముందే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నాగేశ్వర్రావు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో మాట్లాడి కొనుగోళ్లు, మద్దతు ధర విషయంలో చర్యలు తీసుకోకపోవడంతో జాప్యం జరుగుతుందన్నారు.
దిగుబడులు వస్తున్నా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభంకాకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు పంటను విక్రయించే ప్రమాదం నెలకుందని తెలిపారు. సోయాబిన్ దిగుబడులు ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు వచ్చాయని, ప్రభుత్వం ఎకరాకు ఆరున్నర క్వింటాళ్లు మాత్రమే సేకరిస్తుండడంతో మిగిలిన పంటను దళారులకు విక్రయించి నష్టపోతున్నారన్నారు. సోయా ఎకరాకు పది క్వింటాళ్లు కొనాలని ఫోన్లో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రితో మాట్లాడినట్లు గొప్పలు చెప్పుకున్నారని కొనుగోళ్లు మాత్రం పెరగలేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్రాన్ని ఒప్పించి గుజరాత్ ధర కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
క్వింటాలుకు రూ.7,521 ధర ఉండగా కేంద్రమంత్రులను కలిసి ఆదిలాబాద్ జిల్లా రైతులకు గుజరాత్ మాదిరి పత్తి క్వింటాలుకు రూ.8,257 ఇప్పించాలన్నారు. గుజరాత్ పత్తి స్టేబల్ 31 ఉంటే ఆదిలాబాద్ పత్తి 33 ఉంటుందని యార్న్ కూడా బాగుంటుందని తెలిపారు. ఆదిలాబాద్‌లో సీసీఐ సేకరించిన పత్తి బేళ్ల ధర ఎక్కువ ఉంటుందన్నారు. ప్రైవేటు వ్యాపారుల పత్తిని ఎక్కువ ధరకు కొనుగోలు చేసేలా సీసీఐ వాణిజ్య కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరేలా ఇంద్రవెల్లి, నార్నూర్‌లలో సీసీఐ కేంద్రాలను ప్రారంభించాలన్నారు. పంటల కొనుగోళ్ల విషయంలో న్యాయం జరగకపోతే రైతుల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రోకండ్ల రమేశ్, యానిస్ అక్బానీ, విజ్జిగిరి నారాయణ, యాసం నర్సింగరావు, మొట్టు ప్రహ్లాద్, జగదీశ్, ప్రహ్లాద్, జగదీశ్వర్, కొమ్ర రాజు, సతీష్‌లు పాల్గొన్నారు.