ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్వహణ లోపం ఫలితంగా రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీసీఐ కేంద్రం వద్ద సిబ్బంది సహకరించకపోవడంతో, ప్రైవేట్ వ్యాపారులకు పంటను విక్రయిస్తున్నారు. దీంతో మద్దతు ధర కూడా అందక, రైతులంతా నష్టపోతున్నారు. కనీసం మార్కెట్‌యార్డులో అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు కూడా సిబ్బంది ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, డిసెంబరు 13 (నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, డిసెంబరు 13 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానకాలం సీజన్లో పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. జిల్లాలో నల్లరేగడి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండడం ఇందుకు కారణం. జిల్లాలో పత్తి సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుంది. దీంతో ఏటా జిల్లాలో ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గతేడాది 3,83,251 ఎకరాల్లో రైతులు తెల్లబంగారాన్ని పండించగా, ఈ ఏడాది 4,12,436 ఎకరాల్లో పంట వేశారు.
జిల్లా వ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో 28.87 లక్షల క్వింటాళ్ల పంట మార్కెట్ వస్తుందని అంచనా వేసిన అధికారులు ఆదిలాబాద్, బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, జైనథ్ పరిధిలో 11 సీసీఐ కేంద్రాల్లో ఆదిలాబాద్‌లో రెండు, బేల, ఇచ్చోడ, బోథ్, సొనాల, పొచ్చర, నేరడిగొండ, ఇంద్రవెల్లి, నార్నూర్‌లలో మద్దతు ధరతో పంటను సేకరించనున్నారు. గతేడాది క్వింటాలుకు రూ. 6380 ఉండగా ఈ ఏడాది రూ.640 పెంచి 7020తో కొనుగోలు చేస్తున్నారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. బుధవారం ఎడ్లబండ్ల మార్కెట్లో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు లేకపోవడంతో రైతులు వాహనాల ద్వారా పత్తి సేకరించే కాంటాల వద్దకు రావడంతో కొనుగోళ్లకు కొంతసేపు అంతరాయం కలిగింది. ఎడ్లబండ్లపై పత్తిని తీసుకువచ్చిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు పంటను అమ్ముకోవాల్సి వచ్చింది.
మద్దతు ధర క్వింటాలుకు రూ. 7020 ఉండగా ప్రైవేటు వ్యాపారులు రూ. 6700 కు మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో రైతులు క్వింటాలుకు రూ.300 వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఎడ్లబండ్లపై చిన్న రైతులు పత్తిని విక్రయించడానికి వస్తారు. వారికి సీసీఐ కొనుగోళ్లపై సిబ్బంది అవగాహన కల్పించకపోవడంతో నష్టపోతున్నారు. అధికారులు స్పందించి సీసీఐకి తాము పత్తిని అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నేను ఎడ్లబండిలో పత్తిని అమ్మడానికి ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు తెచ్చిన. ఇక్కడ సిబ్బంది సీసీఐ కొనుగోళ్లు లేవని చెప్పిన్రు. దీంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. పత్తిలో 8 శాతం తేమ ఉండగా క్వింటాలుకు రూ.6700కు అమ్మిన. ఇంతే తేమ శాతంతో సీసీఐకి అమ్ముకుంటే క్వింటాకు రూ.7020 వచ్చేది. బండి కాంటా చేస్తే 8.19 క్వింటాళ్లు వచ్చింది. క్వింటాలకు రూ.300 చొప్పున రూ. 2 వేల వరకు నష్టపోయిన. అధికారులు స్పందించి రైతులు నష్టపోకుండా చూడాలి.
– కాళిదాసు, రైతు అర్లి, ఆదిలాబాద్ రూరల్ మండలం