చెన్నూర్, ఫిబ్రవరి 10: ఆరుగాలం కష్టించి పత్తి పంట పండించడం ఒక ఎత్తయితే..చేతికందిన పంటను కాపాడి విక్రయించడం రైతన్నలకు మరో ఎత్తవువుతున్నది. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరుతూ, అధికారులు విధించే అనేక కొర్రీలతో పత్తి విక్రయిచేందుకు కర్షకులు అష్ట కష్టాలు పడుతున్నారు. చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఐదు జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేపడుతున్నారు. కొన్ని రోజులుగా తరచూ కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
మళ్లీ ఐదారు రోజులకు కొనుగోళ్లు ప్రారంభించగా ఇండ్ల వద్ద పేరుకపోయిన పత్తిని వందల సంఖ్యలో వాహనాల్లో రైతులకు ఒక్కసారిగా మిల్లుల వద్దకు తీసుకువస్తున్నారు. వెంట వెంటనే కొనుగోలు చేయలేక సీసీఐ వారు టోకెన్ పద్ధతిని పెట్టారు. టోకెన్లున్న రైతుల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. టోకెన్లు అందని రైతులంతా జిన్నింగ్ మిల్లుల వద్ద వాహనాలతో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఒక్కోసారి రెండు రోజుల పాటు అక్కడే ఉండాల్సి రావడంతో కిరాయికి తెచ్చిన వాహనాలకు వెయిటింగ్ చార్జీల భారం రైతులపై పడుతున్నది.
ప్రభుత్వం పత్తి క్వింటాళ్లకు రూ 7,521 మద్దతు ధర ప్రకటించగా, ప్రారంభం నుంచే రూ 100 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. పత్తిలో తేమ ఉందని, నాసిరకంగా ఉందని, రంగు మారిందంటూ ధర తగ్గించి కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత భూములున్న రైతుల వద్ద నుంచి ఆన్లైన్లో ఉన్న డాటా ద్వారా కౌలు రైతుల నుంచి తాత్కాలిక రిజిస్ట్రేషన్ ద్వారా సీసీఐ కొనుగోలు చేస్తున్నది. ప్రస్తుతం కౌలు రైతుల తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను సీసీఐ నిలిపి వేసింది. ఈ విషయం తెలియక రైతులు వాహనాల్లో జన్నింగ్ మిల్లుల వద్దకు తీసుకువచ్చి ఇబ్బంది పడుతున్నారు.
మరో వైపు సీసీఐ వారు ఎప్పుడూ కొనుగోలు చేస్తారో ? ఎప్పుడు నిలిపి వేస్తారో? కూడా రైతులకు తెలియక పరేషాన్ అవుతున్నారు. దీంతో డబ్బులు అత్యవసరమున్న రైతులు పత్తిని దళారులు, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దళారులు తక్కువ ధర నిర్ణయించి కొనడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు మేలు చేయాల్సింది పోయి ఇలా ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా భేషరతుగా మద్దతు ధర చెల్లించి కొనాలని డిమాండ్ చేస్తున్నారు.
పరేషాన్ చేస్తున్నరు..
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని అమ్ముదామంటే సీసీఐ వారు పరేషాన్ చేస్తుండ్రు. నాకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేయగా 20 క్వింటాళ్ల దాకా పత్తి పండింది. ఇన్ని రోజులు కొనుగోళ్లను నిలిపి వేసి, సోమవారం నుంచి కొనుగోలు చేస్తున్నారని తెలియడంతో పత్తి అమ్ముదామని జిన్నింగ్ మిల్లుకు వాహనంలో తీసుకువస్తే సీసీఐ వారు కొనడం లేదు. పండించిన పంటను అమ్ముకోవడానికే ఇబ్బంది పడితే రైతు బతికేది ఎట్ల. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ప్రకటించిన మద్దతు ధర చెల్లించి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల వద్ద నుంచి కొనాలి.
-శెవ్వ మహేశ్, రాయిపేట, చెన్నూర్ మండలం
కౌలు రైతు పరిస్థితి ఎట్ల..?
రైతు వద్ద నుంచి ఆన్లైన్లో ఉన్న డాటా ప్రకారం సీసీఐ కొనుగోలు చేస్తుండగా, కౌలు రైతుల నుంచి తాత్కాలిక రిజిస్ట్రేషన్ ద్వారా సీసీఐ కొనుగోలు చేస్తున్నది. అయితే ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను సీసీఐ నిలిపి వేసింది. నేను 13 ఎకరాలు కౌలు తీసుకొని పత్తి సాగు చేసిన, నాకు వంద క్వింటాళ్ల వరకు పత్తి పండింది. నాకు తెలియక ఇక్కడికి పత్తి తెచ్చిన. తాత్కాలిక రిజిస్ట్రేషన్లను నిలిపి వేసామని, కౌలు రైతుల పత్తిని కొనుగోలు చేయడం లేదని సీసీఐ వారు చెప్పారు. వాహనంలో లోడ్ చేసుకొని వచ్చాను, సీసీఐ వారు కొనబోమని అంటుంటే నేను ఇప్పుడు ఎక్కడకు పోవాలే.. ఎక్కడ అమ్మాలే.
– సాయిని సత్యం, సుబ్బరాంపల్లి, చెన్నూర్
ఈ ప్రభుత్వ ఏం చేస్తున్నది..?
నేను ఐదు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసిన, నాకు 70 క్వింటాళ్ల వరకు పత్తి పంట పండింది. సీసీఐ సోమవారం నుంచి కొనుగోలు చేస్తున్నదని తెలియడంతో నేను ఒక్క రోజు ముందే ఆదివారం వాహనంలో పత్తి లోడ్ చేసుకొని మిల్లు వద్దకు వచ్చి లైన్ల పెట్టిన. అయితే సీసీఐ వారు మాత్రం పత్తి కొనడం లేదు. రెండు నెలల నుంచి అమ్ముదామంటే ఎప్పుడూ ఇదే తిప్పలు అవుతుందని మిగతా రైతులు చెప్పితే ఇన్ని రోజలు ఆగిన. సీసీఐ వారు గిట్ల రైతులను తిప్పలు పెడుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తునట్టు. పండించుడు కంటే అమ్ముడానికే ఎక్కువ కష్టం అవుతుంది.
-మాలెపల్లి మల్లయ్య, జాజులపేట, వేమనపల్లి మండలం