ఎదులాపురం, మే 6 : రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా పత్తి రైతులు నిలువునా మోసపోయారని, స్థానిక ఎమ్మెల్యే ప్రైవేటు డీలర్లతో ఒప్పందం కుదుర్చుకుని రైతులకు కుచ్చుటోపీ పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసీన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మొత్తం 25 లక్షల మంది పత్తి రైతులు సాగు చేసిన పత్తితో 49 లక్షల బేళ్లు ఉత్పత్తి అయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నామని అన్నారు. ఇందులో 41 లక్షల బేళ్లు సీసీఐ ద్వారా ఖరీదు చేసినట్లు చెబుతున్నారని, మరో ఎనిమిది లక్షల బేళ్లను ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు లెకలు ఉన్నాయన్నారు. అయితే సీసీఐ కేవలం 6.50 లక్షల మంది రైతుల నుంచే పత్తి కొనుగోలు చేసినట్లు ఉందన్నారు.
దీపావళి రోజున హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు, ప్రైవేటు వ్యాపారస్తులతో సమావేశమై రైతులను నిలువునా మోసం చేసే యత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. తాను గతంలోనే హెచ్చరించిన విధంగా స్థానిక ఎమ్మెల్యే అందుకు సహకరించారని, తప్పుల తడకగా ఉన్న లెకలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మారెట్ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, అశోక్ స్వామి, అడప తిరుపతి, ఆలం, నరేశ్, గంగాధర్ పాల్గొన్నారు.