నేరడిగొండ, నవంబర్ 13 : పత్తి రైతును కూలీల కొరత వెంటాడుతున్నది. పంట చేతికొచ్చి నెల రోజులు కావస్తున్నా వర్షాలు, కూలీల కొరత వేధిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ప్రధాన పంటలుగా పత్తి, సోయ, కంది సాగు చేస్తారు. పత్తిని 9346 మంది రైతులు 25,581 ఎకరాల్లో వేశారు. ఈ ఏడాది అకాల వర్షాలతో పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. పత్తి పంట చేతికి రాగా.. పంటను ఏరేందుకు కూలీలు దొరకక అవస్థలు పడుతున్నారు.
కూలీలకు కిలో పత్తిని ఏరడానికి రూ.10 నుంచి రూ.14లు డిమాండ్ చేస్తున్నారు. కూలీల రేట్లు అధికం కావడంతో ఆర్థికంగా భారమవుతున్నది. మహారాష్ట్ర కూలీలకు అధిక కూలి చెల్లిస్తే తప్ప రావడం లేదు. దీంతో పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పత్తిని మార్కెట్కు తీసుకెళ్తే సీసీఐ అధికారులు తేమ పేరిట కొర్రీలు పెడుతూ రైతులను అవస్థలకు గురి చేస్తున్నారు.