బేల, డిసెంబర్ 26 ః సీసీఐ అధికారులు క్వింటాలు పత్తికి రూ.50 తగ్గించడంపై రైతులు రోడ్డెక్కారు. గురువారం బేల అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి సీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలుపడంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి రైతులను సముదాయించారు. సీసీఐ అధికారులు వచ్చే వరకు కదిలేది లేదని తెలుపడంతో అధికారులను తీసుకొచ్చారు. పత్తిని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
నాణ్యతలేని పత్తి, తేమ శాతం అధికంగా ఉన్నట్లయితే పత్తిని కొనుగోలు చేయమని అధికారులు రైతులకు వివరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ అధికారులు మద్దతు ధర క్వింటాలుకు రూ.7,521తో కొనుగోలుకు ముందుకు రావడంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నాణ్యమైన పత్తిని కొనుగోలు చేసి జిల్లా కేంద్రంలో ఉన్న సీసీఐ మద్దతు ధరను రైతులకు ఇవ్వాలని కోరారు. మద్దతు ధరకు సీసీఐ అధికారులు అంగీకరించడంతో రైతులు ధన్యవాదాలు తెలిపారు. దీంతో నాలుగు గంటలపాటు స్థంభించిన వాహనాలను పోలీసులు క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ప్రమోద్ రెడ్డి, దేవన్న, తేజీరావ్, సతీశ్ పవర్, మాస్ తేజీరావ్, గంభీర్ ఠాక్రే పాల్గొన్నారు.