మంచిర్యాలటౌన్, జూలై 31 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అధికారుల అవినీతి బాగోతం బట్టబయలైంది. తమకు కావాల్సిన వారికి పనులు అప్పగించడం కోసం ఆన్లైన్ టెండర్లలో గోల్మాల్ చేసినట్లు తెలుస్తున్నది. ఇటీవల పిలిచిన పలు టెండర్లలో తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు పనులు దక్కించడం కోసం అనవసరమైన నిబంధనలు పెట్టడం, ఎలాంటి కారణాలు లేకుండానే టెండరు రద్దు చేయడం, తిరిగి అనుకూలమైన వ్యక్తులే టెండర్లలో పాల్గొనేలా పావులు కదపడంలాంటి అంశాలను పలువురు కాంట్రాక్టర్లు, కొందరు వ్యక్తులు ఆధారాలతో సహా కలెక్టర్, సీడీఎంఏ, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. పైగా ఒక వర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్లకే ఈ పనులన్నీ దక్కేలా చూశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ తతంగంపై అధికార యంత్రాంగం కదిలింది. ఆన్లైన్ టెండర్ల నిర్వహణ, రద్దుకు కారణమైన అంశాలు, అధికారులకు అనుకూలమైన కాంట్రాక్టర్లకే పనులు రావడంలాంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా సీడీఎంఏతో పాటు వరంగల్ ఆర్డీ నుంచి మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల్లో ముఖ్యంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హరితహారం నర్సరీల నిర్వహణ కోసం లేబర్ నియామకానికి పిలిచిన టెండర్లో ముగ్గురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అందులో నుంచి ఇద్దరిని ప్రలోభపెట్టి ఎలాంటి కారణం లేకుండానే రిజెక్ట్ చేశారు. తిరిగి వారికి అనుకూలమైన వ్యక్తికి ఎస్టిమేట్ రేట్‌కే టెండర్‌ను కేటాయించారు. సాయికుంట ఏరియాలో పట్టణ ప్రగతినిధులతో ఓపెన్‌జిమ్ ఏర్పాటు కోసం పిలిచిన టెండర్‌ను ఓపెన్ చేయకుండానే రద్దు చేశారు. రెండోసారీ టెండర్ పిలవగా అందులో ఇద్దరు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
వారిలోనుంచి ఒకరి దగ్గర లెటర్ తీసుకుని ఎలాంటి కారణం లేకుండానే రిజెక్ట్ చేశారు. అనంతరం వారికి అనుకూలమైన వ్యక్తికి ఎస్టిమేట్ రేట్‌కే కేటాయించారు. ఎలక్ట్రికల్ పనులకు సంబంధించిన ఆన్లైన్ టెండర్లలో అనవసరమైన నిబంధనలను పెట్టి బయట కాంట్రాక్టర్లను టెండరు వేయకుండా అధికారులకు అనుకూలమైన వ్యక్తులకే పనులు దక్కేలా చూశారని ఇక్కడి వ్యక్తులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలో స్ట్రీట్‌లైట్ ఫిక్చర్స్ టేప్స్, సర్వీస్వైర్, జీఐ పైప్స్, క్లాంప్స్, ఎంసీబీలు, సీసీఎం బాక్స్‌ల ఏర్పాటు కోసం పిలిచిన టెండర్లలో మొదటిసారి టెండరును ఓపెన్ చేయకుండానే రద్దుచేశారు. రెండోసారి మళ్లీ టెండర్ పిలిచారు.
ఇందులో అనవసరమైన నిబంధనలను పెట్టి బయట వ్యక్తులు పాల్గొనకుండా చూసి తమకు అనుకూలమైన వ్యక్తులకు ఈ పనులు దక్కేలా చూశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా మారిన తర్వాత ఇందులో విలీనమైన నస్పూరు మున్సిపాలిటీతో పాటు వేంపల్లి, ముల్కల, గుడిపేట, నంనూరు, నర్సింగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయాలకు, వాటర్ ట్యాంకర్లకు బోర్డులను రాసేందుకు కూడా నామినేషన్‌పై తమకు అనుకూలమైన వారికి పనులు అప్పగించారు. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో మట్టిని నింపేందుకు, ఇతర నామినేషన్ పనులను కూడా అధికారులు తమకు కావాల్సిన వ్యక్తులకే అప్పగించారన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు.
మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డులో నిర్మించిన వైకుంఠధామం నిర్మాణ పనులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. వైకుంఠధామం నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని, నాలుగున్నర కోట్లతో చేపట్టాల్సిన పనిని రూ. 10 కోట్లకు అంచనాలు పెంచి నిర్మించారని, గోదావరినది నుంచి మట్టిని అనుమతులు లేకుండా తీసుకువచ్చారని స్థానిక మాజీ ప్రజాప్రతినిధి ఒకరు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదుచేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంచనావ్యయం అమాంతంగా పెంచేయడం, ఇందులో అధికారులు నిబంధనలు పాటించక పోవడం లాంటి అంశాలను అందులో ప్రధానంగా పేర్కొన్నట్లు సమాచారం.