మంచిర్యాల, జూలై 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు నిజాయితీ ఉంటే, దమ్ముంటే సింగరేణిపై చర్చించేందుకు శాసనసభ పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సింగరేణి స్కామ్‌లను ఆధారాలతో రుజువు చేయడానికి నేను సిద్ధమని, ఒకవేళ నేను చెప్పింది అవాస్తవమైతే నా పదవికి రాజీనామా చేసి, శాసనసభ నుంచి బయటకు పోవడానికి సిద్ధమని సవాల్ విసిరారు. రెండు నెలలుగా మేము సింగరేణి స్కామ్‌లపై మాట్లాడుతుంటే మీరు నోరు విప్పడం లేదంటేనే కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో బుధవారం శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియా సింగరేణి కార్మికులు, టీబీజీకేఎస్ నాయకులతో ‘సింగరేణి పరిరక్షణ సదస్సు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పుడేం ఎన్నికలు లేవు.. రాజకీయాల కోసం కాదు… రేపో మాపో ఓట్లు వేసేది అంతకంటే లేదు… ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉంది.. కానీ మేము చేస్తున్న పోరాటం సింగరేణిని కాపాడటానికి అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రెండున్నర సంవత్సరాలలోనే సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ఆగం చేసిందని, ఇప్పటికీ మనం మేల్కొనకపోతే ఈ సింగరేణిని ఏ అదానీకో, అంబానీకో అమ్మేస్తుందన్నారు. ఇప్పటికే సిరుల గనిగా ఉన్న సింగరేణిని కాంగ్రెస్ కుంభకోణాల గనిగా మార్చిందన్నారు. కాంగ్రెస్ దురాగతాలను ఎండగట్టి అందరం కలిసి ఈ కాంగ్రెస్ మీద, ఈ యాజమాన్యం మీద పోరాడి సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు నోరెత్తరు..
దాదాపు రెండు నెలలుగా మేం పోరాడుతూ వచ్చామని, సింగరేణి స్కామ్‌లను ఒక్కొక్కటిగా బయట పెట్టామని హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ దెబ్బకు దిమ్మతిరిగి కొన్ని స్కామ్‌లు ఆగిపోయాయని, మరికొన్నింటి టెండర్లు చేంజ్ అయ్యాయన్నారు. రెండు నెలలుగా సింగరేణి స్కామ్‌లపై మేం మాట్లాడుతుంటే, నిజాలు బయటపెడుతుంటే సీఎం గానీ, ఉప ముఖ్యమంత్రి గానీ నోరు విప్పడం లేదన్నారు. నిజంగా మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఉంటే, తప్పు ఉంటే ఇప్పటికే ఆకాశమంత ఎత్తు ఎగిరిపడేవారని, కానీ తేలు కుట్టిన దొంగల్లా ఎందుకు నోరు మూసుకున్నారో కార్మికులు అర్థం చేసుకోవాలన్నారు. కార్మిక మంత్రి మాట్లాడడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడడు, ముఖ్యమంత్రి అసలు పెదవే విప్పకపోవడానికి కారణం, ఈ స్కాము ల్లో ప్రధాన పాత్రధారి, సూత్రధారి రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డే అన్నారు. బీఆర్ఎస్ నిజానిజాలను బయటపెడుతుంటే.. ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెదవులు విప్పడం లేదో దయచేసి కార్మిక సోదరులు ఆలోచించాలన్నారు. నేనేం రాజకీయాలు మాట్లాడడం లేదని, సింగరేణిలో జరుగుతున్న తప్పులు, అవినీతి, సంస్థ ఎట్లా దిగజారుతుందో, సంస్థ ఏ వైపు పోతుందో నిజానిజాలను మీ ముందు ఆధారాలతో సహా పెట్టే ప్రయత్నం చేస్తున్నానన్నారు. నేను మాట్లాడే ప్రతి మాట డాక్యుమెంటరీ ఎ విడెన్స్తో మాట్లాడుతున్నానని, ఆరు నెలలు రీసెర్చ్ చేసి, ఆరు నెలలుగా సమాచార హక్కు చట్టం కింద అన్ని వివరాలు సేకరిం చి ఆధారాలతో మీ ముందు మాట్లాడుతున్నానన్నారు. దీనిపై దమ్ముంటే రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని, అసెంబ్లీలో ఆధారాలతో సహా రుజువు చేయడానికి నేను సిద్ధమని, ఒకవేళ నేను చెప్పింది అవాస్తవమైతే పదవికి రా జీనామా చేసి, శాసనసభ నుంచి బయటకు పోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు చేసిన పోరాటం అంతా ఇంతా కాదని, మీ పోరాటంతో నాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ‘సింగరేణి బొగ్గు బావులు మూతపడ్డాయట.. విద్యుత్ థర్మల్ కేంద్రాల దగ్గర బొగ్గు లేదు, కరెంట్ ఆగిపోతది, దక్షిణ భారతదేశమే ఆగమైతది’ అని ప్రధానే దిగివచ్చేంత గొప్ప సమ్మె మా సింగరేణి కార్మికులు చేశారన్నారు.
16 వేల ఉద్యోగాలిచ్చి మేం చెప్పుకోలేదు..
ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు, జాతీయ పార్టీ కాంగ్రెస్ డిపెండెంట్ ఉద్యోగాలు తీసేశాయన్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి 16 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నా రు. బీఆర్ఎస్ డిపెండెంట్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ మోసాన్ని ఎండగడితే.. దెబ్బకు డిప్యూటీ సీఎం భట్టి, నలుగురు మంత్రులు వచ్చి 330 మందికి కారుణ్య నియామకాల కింద డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మేము 16 వేల మందికి ఉద్యోగాలు ఇస్తే మంత్రులు, ముఖ్యమంత్రి వచ్చి చిన్న మాట మాట్లాడలేదని, సింగరేణి అధికారాల చేత సాదాసీదాగా నియామకాలు చే శామన్నారు. తేడా ఏందంటే 16 వేల ఉద్యోగాలు ఇచ్చినా మనమేమో చెప్పుకోలేదు, వాళ్ళు 300 ఇస్తే నలుగురు మంత్రులు వచ్చి, బీఆర్ఎస్ దెబ్బకు 300 ఉద్యోగాలు ఇచ్చి, మూడు గంటల స్పీచ్‌లు దంచిపోయారన్నారు. సింగరేణి ఏరియాలో వేల ఇండ్ల పట్టాలు ఇచ్చి సైతం చెప్పుకోలేదన్నారు. మేము చెప్పుకోక వెనకపడితే, వాళ్ళు చెయ్యడానికే చెప్పుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో సింగరేణిలో జరిగిన స్కామ్‌లపై ఈ సందర్భంగా హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో సింగరేని కుంభకోణాల గనిగా మారిందన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్, ఎక్స్‌ప్లోజివ్స్ స్కామ్, డీజీల్ స్కామ్‌లను దాదాపు గంటన్నర పాటు కులంకషంగా కార్మికులకు వివరించారు.
సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులకు సంపూర్ణ మద్దతు
ఆనాడు సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్‌ను తెరిపించడానికి మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఎంతో కష్టపడి, కేసీఆర్ ఆశీస్సులతో, కేటీఆర్ కృషితో, మా అందరి సహకారంతో పేపర్ మిల్ ఓపెన్ చేయించారన్నారు. అక్కడ కార్మికులు గత 42 రోజులుగా కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని సమ్మె చేస్తున్నారన్నారు. కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని వారు చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియ చేస్తున్నామన్నారు. ఈ విషయంపై తప్పకుండా లేబర్ కమిషనర్ తో మాట్లాడుతామని, అవసరమైతే లీగల్‌గా పోరాడైనా సరే సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్కు ఎన్నికలు నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ తరుఫున పూర్తి సహకారం అందిస్తామమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్కసుమన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, పుట్ట మధు, కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, కౌశిక్ హరీ, విజిత్‌రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, సురేందర్‌రెడ్డి, సంపత్ పాల్గొన్నారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. అలవికాని హామీలతో కార్మికులను నట్టేట ముంచిందని, గడిచిన రెండున్నరేండ్లలో ఏ ఒక్క హామీ అమలు కాలేదని విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ ఇన్వాలిడేషన్ పథకాన్ని తీసుకొచ్చి 16 వేల మంది యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహించేవారని, కాంగ్రెస్ రెండున్నరేండ్లలో రెండు మెడికల్ బోర్డులు నిర్వహించి డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా మనోవేదనకు గురి చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేందుకు సభలు నిర్వహిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు పొందిన వారసులపై విజిలెన్స్ విచారణ పేరిట భయభ్రాం తులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని కార్మిక వర్గం ప్రతిఘటించాల్సి అవసరం ఉందని పిలుపు నిచ్చారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన మాజీ విప్ బాల్క సుమన్ పై తప్పుడు కేసలు నమోదు చేసి నెల రోజలు జైలులో పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నించే హక్కు లేదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
– కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి
కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టాలి..
సింగరేణిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన బావమరిదికి ఎక్సెస్ టెండర్లకు పనులు కట్టబెడుతూ కోట్లాది సంపదను దోచి పెడుతున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సింగరేణి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. కార్మికుల హక్కుల సాధన, సంస్థ పరిరక్షణ టీబీజీకేఎస్‌తోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కార్మికులు మోసపూరిత యూనియన్ల మాటలను నమ్మకుండా టీబీజీకేఎస్‌కు మద్దతుగా నిలివాలని కోరారు.
– నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల.
సింగరేణి రక్షణే బీఆర్ఎస్ ధ్యేయం
సింగరేణి రక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ పోరాటాలు సాగిస్తున్నదని, బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి కల్పతరువుగా నిలిచిందని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని స్కాంలు, స్కీంల సంస్థగా మార్చిందని, విపరీతమైన రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన ఆర్భాటాలకు సింగరేణి సొమ్ము ను దుర్వినియోగం చేయడంతోపాటు ఆయన బంధువర్గీయులకు ఎక్సెస్ టెండర్లను కట్టబెట్టి వేల కోట్ల రూపాయల సింగరేణి సొమ్మును అప్పనంగా దోచి పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో అన్ని బా గానే ఉంటే.. సింగరేణి ప్రాంతంలోని బెల్లంపల్లి నుంచి సత్తుపల్లి వరకు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు. ఉప ఎన్నికలతో వాస్తవాలు బయటకు వస్తాయని, నిజాలు గ్రహిస్తున్న కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. హరీశ్‌రావు రేవంత్‌రెడ్డి మాదిరి జెండాలు మార్చి అక్రమ మార్గంలో పదవులు దక్కించుకొనే నాయకుడు కాదని, నిఖార్సయిన తెలంగాణ ఉద్యమనేత అని కొనియాడారు.
– మాజీ విప్ బాల్క సుమన్
సింగరేణిని నష్టాల పాలు చేస్తున్న కాంగ్రెస్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు కొంగు బంగారమైన, దక్షిణాది రాష్ర్టాలకు వెలుగులను పంచుతున్న సింగరేణి సంస్థను నష్టాలపాలు చేస్తున్నదని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే స్కాంలు, స్కీంలు అవినీతి అక్రమాలని విమర్శించారు. సింగరేణి లో ఎన్నడూ లేని విధంగా కమీషన్లకు ఆశపడి కాంట్రా క్టర్లకు ఎక్సెస్ టెండర్లు ఇచ్చే సంస్కృతి మొదలైందని, ఇది సింగరేణి భవిష్యత్ మనుగడకు తీవ్ర ప్రమాదకర మని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధానాలు అమలు పరుస్తూ సంస్థను నష్టాల పాలు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాటాలకు సిద్ధం కావాలని, సింగరేణి రక్షణకు టీబీజీకేఎస్ కార్మికుల వెన్నంటి ఉంటుందని తెలిపారు.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు.
సింగరేణి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలి..
సింగరేణి సంస్థను కాపాడుకొనేందుకు కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపు నిచ్చారు. సింగరేణి కార్మికులకు సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, స్కాములను వివరించడానికే బీఆర్ఎస్ సింగరేణి రక్షణ సదస్సులను నిర్వహిస్తున్నదని తెలిపారు. కార్మికులు సదస్సులో శాసనసభ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశాలను గనులు, కార్మిక వాడల్లో చర్చించాలని సూచించారు. సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చే సత్తా ఒక్క బీఆర్ఎస్, టీబీజీకేఎస్‌కే ఉందని అన్నారు. కార్మికులు సంస్థ రక్షణ కొరకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. – దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే, బెల్లంపల్లి.