నార్నూర్ : ఏజెన్సీలోని ఎస్సీలకు రాజ్యాంగపరమైన హక్కులు (Constitutional rights ) కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ షెడ్యూల్ కులాల పోరాట ఉపాధ్యక్షుడు, దళిత అవార్డు గ్రహీత నర్సింగ్ మోరే( Narsing More) డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలో నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్లా కార్డులతో తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రెవెన్యూ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్సీలకు కనీసం రాజ్యాంగ పరమైన హక్కులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవు తున్నాయని ఆరోపించారు. ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకునే నాథులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస హక్కులు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని అన్నారు. కనీస హక్కులు కల్పించని పక్షంలో రానున్న ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఏజెన్సీలో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించేందుకు సన్నతమవుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుర్గే కాంతారావు, సంతోష్ మాన్నే, నరహరి కాంబ్లే, లోకండే దేవరావు తదితరులు ఉన్నారు.