చెన్నూర్ రూరల్, జూలై 5 : రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తున్నదని, ప్రజలంతా గమనిస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం భూపాలపల్లి (జయశంకర్) జిల్లాలోని కన్నెపల్లి వద్ద ఉన్న పంపు హౌస్ సందరర్శనకు బయలుదేరగా, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావుతో పాటు చెన్నూర్, మంచిర్యాల నియోజక వర్గాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను చెన్నూర్ ప్రధాన రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు-పోలీసులకు కొంతసేపు వాగ్వాదం జరిగింది.

ఆపై బీఆర్ఎస్ శ్రేణులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన కన్నెపల్లిలోని పంపుహౌస్ సందర్శనకు వెళ్తుండగా అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించడం సిగ్గు మాలిన చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే కన్నెపల్లి వద్ద గోదావరి నుంచి నీరంతా వృథాగా దిగువకు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బండారం బయట పడుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని, అది చూసి జీర్ణించుకోలేక సీఎం రేవంత్ రెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లి పోయి, బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమంగా కేసులు నమోదు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌కుమార్, మూల రాజిరెడ్డి, మల్లెల దామోదర్ రెడ్డి, మోతె తిరుపతి, రేవల్లి మహేశ్, ఇమ్రాన్, కొప్పుల ప్రభాకర్, దోమకొండ అనిల్, రత్న సమ్మిరెడ్డి, బుర్ర రాకేశ్‌గౌడ్, అయిత సురేశ్ రెడ్డి, మానిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.