మందమర్రి, ఏప్రిల్ 8: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలసీలో భాగంగా చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఫిబ్రవరి 17న క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన ఘటనలో న్యాయస్థానం మంజూరు చేసిన బేయిల్లో విధించిన షరతు మేరకు మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు రామిడి కుమార్, మహేందర్, శిద, బెల్లం అరుణ్, బెల్లం అశోక్, సీపెల్లి సాగర్, మద్ది శంకర్, కొంగల తిరుపతి రెడ్డి బుధవారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీలో పాలక మండలి ఎన్నిక సందర్భంగా అల్లర్లు సృష్టించిన అధికార కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడి అధికార బలంతో తమ పైనే అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు.
అలవికానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, పాలకులు హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలసీలను అమలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా క్యాతనపల్లి మున్సిపాలిటీలో చివరికి న్యాయమే గెలిచిందని ప్రజాతీర్పు మేరకు బీ ఆర్ఎస్ పాలక మండలిని ఏర్పాటు చేసి ము న్సిపాలిటీని కైవశం చేసుకుందని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా మోసపూరిత హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ సాగిస్తున్న అరాచక పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.