“నా పేరు సుంచు కవిత. మాది నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని తాంశ గ్రామం. మా ఊరును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినట్లు అధికారులు చెప్పిన్రు. అందరికీ ఒకేసారి నాలుగు పథకాలు వస్తయంటే సంతోషపడ్డం. మాకు భూమి లేదు. సొంత ఇల్లు కూడా లేదు. మా ఒక్క కుటుంబానికే ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇల్లు వస్తదని మూడు పథకాలకు సంబంధించిన పేపర్లు ఇచ్చిన్రు. ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇప్పుడున్న రేకుల షెడ్డు తీసేసి పక్కా ఇల్లు కట్టుకోవచ్చనుకున్న. రేషన్ బియ్యంతో పాటు ఉపాధి కూలీలకు ఇచ్చే ఆత్మీయ భరోసా డబ్బులు కూడా వస్తయనుకున్న. కానీ రాలే. రేషన్ కార్డు వచ్చిందన్నరు.. కానీ ఇప్పటికైతే బియ్యం ఇవ్వలేదు. మా ఇంటోళ్లందరం ఉపాధి, ఇతర కూలీ పనులకు పోతం. గీ పథకాలు మాకు ఎందుకు రాలేదో అర్థమైతలేదు. సార్లను అడిగితే పైసలు మళ్లీ పడుతయని చెబుతున్నరు..”
..ఇలా ఈ రెండు గ్రామాల్లో.. ఈ ఇద్దరనే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్కారు ఎంపిక చేసిన ఏ పైలెట్ గ్రామానికి వెళ్లినా.. ఎవరిని కదిలించినా ఈ తరహా పరిస్థితే కనిపించింది. పథకాల కోసం వచ్చిన దరఖాస్తులకు ఎంపిక చేసిన లబ్ధిదారుల సంఖ్యకు అసలు పొంతనే కుదర డం లేదు. ఎంపిక చేసిన వారికంటే రకరకాల కారణాలు చూ పి రిజెక్ట్ చేసినవే ఎక్కువ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇందిర మ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇలా నాలుగు పథకాలను అమలు చేస్తున్నట్లు సర్కారు చెప్పింది. మండలానికి ఓ గ్రామాన్ని పైలెట్‌గా ఎంపిక చేసి ఈ పథకాలను 100 శాతం అమలు చేస్తామని చెప్పింది. ఈ మేరకు పైలెట్ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి 100 శాతం పథకాలు అమలు చేసినట్లు ప్రకటనలు సైతం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ప్రభుత్వ ప్రకటనకు పూర్తి భిన్నంగా ఉంది.
గ్రామ సభల్లో రేషన్‌కార్డులు ఇచ్చినోళ్లకు ఇప్పటిదాకా రేషన్ బియ్యం రాలేదు. ఎందుకు ఇవ్వలేదని లబ్ధిదారులు అడిగితే సివిల్ సప్లయ్ శాఖ నుంచి మీకు రావాల్సిన కోటా బియ్యం కేటాయించలేదని చెబుతున్నారు. ఇక అన్ని అర్హతలున్న అనేక మందిని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపిక చేయనే లేదు. ఎందుకు చేయలేదంటే.. రీవెరిఫికేషన్ చేస్తామని చెబుతున్నారు. అర్హులమై ఉండి దరఖాస్తు చేసుకున్నాక కూడా రేషన్‌కార్డు ఎందుకు రావడం లేదంటే మళ్లీ దరఖాస్తు చేసుకోమంటున్నరు.
వ్యవసాయానే నమ్ముకొని బతికే రైతులకు రైతు భరోసా ఎందుకు రాలేదని పైలెట్ గ్రామంలోని రైతులు అడిగితే… మీరు ఈ గ్రామంలో ఉంటున్నా, మీ భూములు పక్క గ్రామంలో ఉంటే రాదంటున్నారు. ఇటీవల కొనుగోలు చేసిన భూములకు (కొత్త పట్టాలకు) సైతం రాలేదంటే మళ్లీ దరఖాస్తు చేసుకోమని చెబుతున్నారు. వ్యవసాయ కూలీలుగా ఉండి ఉపాధి పనులకు వెళ్లేటోళ్లకు ఆత్మీయ భరోసా ఎందుకు రాలేదంటే.. మీరు సంవత్సరంలో 20 పనిదినాలు చేయలేదంటున్నారు.
ఇలా పైలెట్ గ్రామాల్లో నాలుగు పథకాలపై ఎవరిని ప్రశ్నించినా రీ అప్లికేషన్.. రీ వెరిఫికేషన్ అంటూ అధికారులు చెప్పిన మాటలే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పథకాలను 100శాతం అమలు చేసినట్లు ఎట్లా అవుతుందంటూ అర్హులైన జనాలు ప్రశ్నిస్తున్నారు. శతశాతం అమలుపై మరోసారి గ్రామసభలు నిర్వహించి సర్కారోళ్లు సమీక్షించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం పెండదరిని.. ప్రభుత్వం పైలెట్ గ్రామంగా ఎంపిక చేసింది. ఈ ఊరికి చెందిన రైతు సీడం గంగారాం కు మూడున్నరె కరాల వ్యవసా య భూమి ఉంది. పైలెట్ గ్రామంగా ఎంపికవడంతో రైతు భరోసా కింద రూ.21 వేలు వస్తాయని ఆశపడ్డడు. గ్రామంలో 90 మందికి రూ.20 లక్షల రైతు భరోసా ఇచ్చామని అధికారులు ప్రకటించగా, ఈయనకు కూడా వచ్చి ఉంటుందని బ్యాంక్‌కు వెళ్లి స్టేట్మెంట్ తీయించాడు. కానీ, డబ్బులు పడలేదు.
ఆపై ఎందుకు రాలేదా అని ఆరా తీశాడు. పెండదరి గ్రామ పంచాయతీగా ఏర్పడటానికి ముందు కౌట్ల-బీ పంచాయతీలో ఉండేది. ఈయన భూములు కౌట్ల-బీ పరిధిలో ఉండగా, నివాసం మాత్రం పెండదరిలోనే ఉంది. ఈ కారణంగానే రైతు భరోసా రాలేదని అధికారులు చెప్పారు. ఇలా ఈ ఊరిలో 65 మంది రైతుల భూములు కౌట్ల-బీలో, ఉంటే నివాసాలు మాత్రం పెండదరిలో ఉన్నాయి. అయితే, 90 మందికి రైతు భరోసా ఇచ్చి.. మిగతా 65 మందికి ఇవ్వలేదని, మొత్తం మందికి ఇచ్చినప్పుడే కదా 100 శాతం పూర్తయినట్లు అవుతుందని గంగారం ప్రశ్నిస్తున్నాడు.
కొన్ని పైలెట్ గ్రామాల్లో పథకాల పరిస్థితి ఇదీ..
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాపూర్‌లో రైతు భరోసాకు 376 మంది దరఖాస్తు చేసుకుంటే 20 మందికి కొత్త పట్టా లు ఉన్నందున రైతు భరోసా ఇవ్వలేదు. అధికారులను అడిగితే రీవెరిఫికేషన్ చేస్తున్నామన్నారు. ఇదే గ్రామంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అర్హులైనవారందరికీ రేషన్‌కార్డులు రాలేదు. మరోసారి దరఖాస్తు చేసుకోమన్నారు. ఇదే గ్రామంలో సొంత భూములున్నవారిని సైతం ఆత్మీయ భరోసాకు ఎంపిక చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం పెండదరి గ్రామంలో 155 మంది రైతులు ఉంటే 90మందికే రైతు భరోసా ఇచ్చారు. మిగిలిన 65 మంది రైతులు ఇదే గ్రామంలో ఉంటున్నా పక్క ఊరిలో భూములు కలిగి ఉన్నారని వారికి రైతు భరోసా ఇవ్వలేదు. దీంతో రైతు భరోసా వస్తుందో రాదో అని ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం బుగ్గగూడెం పైలెట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు 199 మంది దరఖాస్తులు చేసుకుంటే 117 మందికి మంజూరు చేసినట్లు చెబుతున్నారు. కానీ, అర్హులైన వారిని కాదని వారికి నచ్చిన వాళ్లనే ఇండ్ల కోసం ఎంపిక చేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే జిల్లా జన్నారం మండలం కొత్తపేటలో 67 మందికి రేషన్ కార్డులకు ఎంపికైనట్లు పత్రాలు ఇచ్చారు. కానీ, ఇప్పటి దాకా వారికి రేషన్ బియ్యం ఇవ్వడం లేదు. కోటా బియ్యం రాలేదని చెబుతున్నారు. దాదాపు పైలెట్ గ్రామాల్లో ఎంపిక చేసిన ఎవ్వరికీ రేషన్ బియ్యం ఇవ్వలేదని తెలుస్తున్నది. ఒకటీ రెండు గ్రామాల్లో రేషన్‌కార్డు నంబర్‌పై రేషన్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
గ్రామ సభ అయ్యాక అధికారులు కనిపిస్తలేరు
నాకు పెళ్లయి 8 ఏళ్లవుతుంది. ఇద్దరు పిల్లలున్నారు. గతంలో ఆన్లైన్లో ఒకసారి, ఆరు గ్యారంటీ లప్పుడు మరోసారి, మొన్న సర్వే అప్పుడు ఒకసారి, గ్రామసభలో ఒకసారి ఇలా నాలుగు సార్లు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా. కానీ నాకు రేషన్‌కార్డు రాలేదు. గ్రామసభలో కొత్త రేషన్ కార్డు ఇస్తామన్నారు. కానీ నా పేరు రాలేదన్నరు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నరు. గ్రామ సభ అయినప్పటి నుంచి ఏ అధికారి కనిపించడం లేదు. గ్రామంలో సమస్యలు ఎక్కువయ్యాయి. పట్టించుకునే వారే లేరు.
– విగ్నేశ్, బాబాపూర్ పైలెట్ గ్రామం, కుమ్రంభీం ఆసిఫాబాద్
గూన ఇంట్లో ఉంటున్నా.. మమ్ముల ఎంపిక చేయలే
మా ఊరిని పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. ఇల్లు వస్తుందని సంతోషపడ్డం. ఇప్పుడు గూన ఇంట్లో ఉంటున్నం. డ్వాక్రా రుణం తీసుకొని ట్రాలీ కొనుగోలు చేసి నడుపుకుంటున్నం. కానీ ఫోర్ వీలర్ ట్రాలీ ఉందని మాకు ఇల్లు మంజూరు చేయలేదు. కొందరికి ట్రాక్టర్లు, సొంత ఇల్లు ఉన్నా వాళ్లను ఎంపిక చేశారు. అడిగితే రీ వెరిఫికేషన్ చేస్తామంటున్నరు. అప్పు తీసుకొని ట్రాలీ నడుపుకుంటున్న మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలని వేడుకుంటున్నా.
– రాజేశ్వరి, బుగ్గగూడెం పైలెట్ గ్రామం, మంచిర్యాల