కుభీర్ : అకాల వర్షం ( Rains) కుభీర్ మండల రైతాంగానికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చిన నేపథ్యంలో అమ్ముకుందామనుకునే సమయంలో వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ప్రకృతి కన్నెర్ర చేయడం , సోయా( Soya ) చేతికి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో సోయా పంట రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government ) ఉందా లేదా అన్న సందేహం రైతుల్లో విస్మయానికి గురిచేస్తుంది. నెల రోజులుగా సోయా పంట చేతికి వచ్చినప్పటికీ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంలోని ఆంతర్యం ఏమిటో రైతులకు అర్థం కావడం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కన్నీళ్లు తెప్పించి ఉసురు పోసుకుంటుందని రైతులు పేర్కొన్నారు.

బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కుభీరులోని మార్కెట్ యార్డులో కుప్పలు వేసిన సంచులు తడిసి ముద్దయ్యాయి. పైనుంచి పాలిథిన్ కవర్లు కప్పినప్పటికీ కింది నుంచి వర్షపు నీరు చొచ్చుకు వచ్చి తడిసిపోయాయి. చేలల్లో రైతులు సాగు చేసిన పత్తి పంట తీసి ఇంటికి తెచ్చుకుందామనుకుంటున్న తరుణంలో వివిధ పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మొక్కజొన్నకు మొలకలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట చేతికి వచ్చిన సమయంలోనే కొనుగోలు కేంద్రాలను తెరిచి మద్దతు ధరతో కొనుగోలు చేసిందని గుర్తుకు చేసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన సోయా, మొక్కజొన్న, పత్తి పంటలను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. సీసీఐ పత్తి కొనుగోళ్లను చేపట్టకపోవడంతో రైతులు మండిపడుతున్నారు.