నిర్మల్, మే 24(నమస్తే తెలంగాణ) : ప్రజల జీవన ప్రమాణాలు, క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబించాల్సిన జనగణన(సెన్సెస్) నిర్మల్ జిల్లాలో ఒక ప్రహసనంగా మారుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు చెప్పే సమాధానాలతో మాకు సంబంధం లేదు. మేము చెప్పిందే ఎంటర్ చేయాలంటూ కొందరు ఉన్నతాధికారులు ఎన్యుమరేటర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు రెండు రోజుల క్రితం సెన్సెస్‌ను పర్యవేక్షిస్తున్న జిల్లాస్థాయి అధికారులతోపాటు మండల స్థాయి అధికారులు ఎన్యుమరేటర్లతో సమావేశాలు నిర్వహించి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ రికార్డుల్లో జిల్లా, రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా చూపించే తాపత్రయంతో పేదల వాస్తవ పరిస్థితులను తుడిచేసే ప్రయత్నం జరుగుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తుంటే, ప్రజలు తమకు లేని సదుపాయాల గురించి వాపోతున్నారు. కానీ.. అధికారులు మాత్రం దానికి విరుద్ధంగా డేటా ఎంటర్ చేయాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొందరికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు లేవు. కట్టెల పొయ్యిలే దిక్కు. రికార్డుల్లో మాత్రం అందరికీ గ్యాస్ కనెక్షన్ ఉంది అని నమోదు చేస్తున్నారు. అలాగే బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా చూపించుకోవాలనే ఆరాటంతో ఇంట్లో మరుగుదొడ్డి సౌకర్యం లేకపోయినా ‘ఉంది’ అనే ఆప్షన్ నొక్కాలని ఒత్తిడి చేస్తున్నారు.
కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ తాగునీటి ఎద్దడి ఉంది. నల్లా నీరు రాని ఇండ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికీ భగీరథ నీరు అందుతున్నదని కచ్చితంగా రాయాలని ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండున్నరేళ్ల కాలంలో అనేక మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారు. వారికి నల్లా కనెక్షన్‌తోపాటు, మరుగుదొడ్డి సదుపాయం కూడా లేదు. అలాంటి వారికి అన్నీ ఉన్నట్లు నమోదు చేయాలని ఆదేశాలు అందాయి. అలాగే అత్యంత పేద కుటుంబాల్లో కనీసం కీప్యాడ్ ఫోన్ కూడా లేని పరిస్థితి ఉంటే.. అందరి ఇళ్లలోనూ మొబైల్ ఫోన్స్ ఉన్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు.
మొబైల్ ఫోన్ లేని ఇల్లు లేదన్నట్లుగా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. మండుటెండలో ఇంటింటికీ తిరుగుతూ ఇప్పటికే 50 శాతానికి పైగా ఇండ్ల గణన పూర్తి చేసిన ఎన్యుమరేటర్లకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా ఆదేశాలు వారిని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. జనగణన సర్వేలో మరుగుదొడ్లు, నల్లా కనెక్షన్, మొబైల్ ఫోన్ లేని ఇండ్లను నమోదు చేసిన ఎన్యుమరేటర్లందరికీ మళ్లీ కొత్త వివరాలు నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు.
ఎడిట్ ఆప్షన్ ద్వారా వసతులు లేని ఇళ్లకు అన్నీ ఉన్నట్లు చూపాలంటూ పేర్కొనడంతో ఎన్యుమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా హౌస్ లిస్టింగ్ పూర్తి చేశామని సంబరపడుతున్నారు. ఈ సమయంలో అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో మళ్లీ మొదటి నుంచి పని చేయాల్సి రావడం తీవ్ర నిరాశకు గురి చేసిందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ ఎన్యుమరేటర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అధికారుల ఆకస్మిక నిర్ణయంతో ఎన్యుమరేటర్లు అంతా అయోమయంలో ఉన్నారని అంటున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వివిధ సదుపాయాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మెరుగైన ర్యాంకులు సాధించి కేంద్రం నుంచి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు దక్కించుకున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న జనగణనలో ప్రజలు చెప్పినట్లు ‘సదుపాయాలు లేవు’ అని నిజాలు నమోదు చేస్తే.. జిల్లా, రాష్ట్ర స్థాయిలో గతంలో నమోదైన ర్యాంకులు పడిపోతాయనే భయంతోనే పాలకులు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అవసరమయ్యే నిధులను ఈ జనగణన డేటా ఆధారంగానే కేటాయిస్తాయి. జిల్లాలో ఇంకా ఎంతమందికి ఇళ్లు లేవు, ఎంతమందికి తాగునీరు అందడం లేదు, ఎంతమందికి మరుగుదొడ్లు లేవు అనే నిజాలు తెలిస్తేనే కొత్త పథకాలు అమలుకు నోచుకొని నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. కానీ అధికారుల ఒత్తిడి కారణంగా ఇప్పుడు అందరకీ అన్నీ ఉన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తే.. భవిష్యత్‌లో జిల్లాకు వచ్చే నిధులు ఆగిపోయే అవకాశం ఉంది.
పాలకులు, అధికారుల అనాలోచిత చర్య కారణంగా అర్హులైన పేదలకు శాశ్వతంగా అన్యాయం జరుగుతుంది. ర్యాంకుల కోసం, పై అధికారుల మెప్పు కోసమో వాస్తవాలను సమాధి చేయడం సరికాదని జిల్లా ప్రజలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో జనగణన ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలు చెప్పిన వాస్తవాల ఆధారంగానే సాగేలా చూడాలని కోరుతున్నారు.