బెజ్జూర్, జూలై 16: యూరియా సరఫరా చేయడంలో రేవంత్ సర్కారు విఫలమైందని, రైతులు చేలు, పొలం పనులు వదిలి ఎరువుల కోసం తిరగాల్సిన దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ అన్నారు. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లోని సహకార సంఘం వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యారియాను రైతులకు సరఫరా చేయకుండా దళారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దళారులు బస్తా యూరియాను రూ.400-500 వరకు విక్రయించి దోపిడీ చేస్తున్నారని, ఇలాంటి వారిపై పీడీయాక్టుపై నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
సల్లుగుపల్లిలో ఉన్న డీసీఎంఎస్‌కు వచ్చిన యూరియా లారీ లోడ్‌ను మర్తిడి గ్రామంలోని బడా నాయకుడి ఇంటి ముందు ఎలా పంచుతారని అధికారులను ప్రశ్నించారు. వెంటనే డీసీఎంఎస్ డీలర్ లైసెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లి, 50 యూరియా బస్తాలను కూడా తీసుకరాలేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ బాబు ఎరువుల సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. పాపన్ పేట, తలాయి, తిక్కపల్లి తదితర గ్రామాల్లో వరదలతో ముంపునకు గురై పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలనిడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బారయ్య, నాయకులు ఖాజామోహినుద్దీన్, ఫసీ, మోహన్, తదితరులు పాల్గొన్నారు.
పెంచికల్ పేట్, జూలై 16 : ఇటీవల కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారీ కృష్ణ వేధింపులతోనే మనస్తాపానికి గురై పెంచికల్ పేట్ మండలంలోని అగర్‌గూడకు చెందిన రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ కేసు విచారణలో అధికారులు, ప్రభుత్వం జాప్యం చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం రాజశేఖర్ కుటుంబాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఆత్మహత్య చేసుకొని నెల రోజులైనా కేసులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. కేసులో కీలకమైన ఆధారాలు, సాక్షులు, రాజశేఖర్ మరణ వాంగ్మూలం ఉన్నా, విచారణలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
నిందితుడు బెయిల్ మీద బయటకి వచ్చాడని, సాక్షులను బెదిరింపులకు గురిచేసే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాజశేఖర్ ఆత్మహత్యకు కారణమైన కృష్ణ తో పాటు ఆయన సతీమణిపై ఫిర్యాదు చేసినా ఆమెపై కేసు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాతామని, వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు షరీఫ్, బాబాజీ, దేవాజీ, నవీన్, అనూప్ తదితరులు పాల్గొన్నారు.