మంచిర్యాల, మే 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, రైతుల పాలిట మరణ శాసనం రాస్తున్నది. పంటను కొనే దిక్కు లేక రోజుల తరబడి కల్లాల్లో కాపాల కాస్తూ, దిగులుతో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. భారీ వర్షం, ఈదురుగాలులకు కల్లాల వద్దకు వెళ్లిన రైతులపై గోడలు కూలి పడి నలుగురు మృత్యువాత పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు వేర్వేరు ఘటనల్లో ఓ చోట గోడ, మరో చోట షెడ్డు కూలిపడడంతో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు.
బాధిత కుటుంబ సభ్యులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని గంపలపల్లికి చెందిన రైతు తనుగుల నాగరాజు(48) తన ఐదెకరాల్లో పండించిన ధాన్యాన్ని 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. పది రోజుల క్రితం తూకం వేసిన అధికారులు తరలించకుండా కేంద్రంలోనే ఉంచారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులు వీస్తుండడంతో నాగరాజు తన పెద్ద కుమారుడు అభిరామ్(24)ను తీసుకొని కేంద్రానికి వెళ్లాడు. ధాన్యం బస్తాలపై టార్పాలిన్లు కప్పుతుండగా వర్షం మొదలైంది. ఆగమాగం పరదాలు కప్పి సమీపంలోని ఓ గోడ దగ్గరకు వెళ్లారు.
ఆ గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఊపిరి ఆడక అభిరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగరాజును లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచాడు. తూకం వేసిన ధాన్యం 24 గంటల్లో తరలించాలి. కానీ.. పది రోజులైనా డీఆర్డీఏ అధికారులు పట్టించుకోలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం తీసుకెళ్లి ఉంటే నాగరాజు, అభిరామ్ అక్కడికి వచ్చేవాళ్లే కాదని సర్కారు నిర్లక్ష్యంతోనే తండ్రీకొడుకులు మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఘటనలో లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు కొనుగోలు కేంద్రానికి రైతు గుండారపు వెంకటేశ్(23) 20 రోజుల క్రితం ధాన్యం తెచ్చి కల్లంలో పోశాడు.
తూకం వేయకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి ఊదురుగాలులు, వర్షం నుంచి కాపాడుకోవడానికి కల్లానికి వచ్చాడు. ధాన్యపు రాశులపై పరదాలు కప్పి భారీవర్షం పడుతుండడంతో స్థానిక రైతులతో కలిసి సమీపంలోని ఓ షెడ్డులో ఆగాడు. ఈ క్రమంలో ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కె లచ్చన్న(48) తన కొడుకును లక్షెట్టిపేట చౌరస్తా వద్ద హైదరాబాద్ బస్ ఎక్కించి, తిరిగి వెళ్తుండగా వర్షం ఎక్కువ కావడంతో రోడ్డు పక్కన బండి ఆపుకొని రైతులున్న అదే షెడ్డులోకి వెళ్లాడు. భారీగా వచ్చిన ఈదురుగాలులకు ఒక్కసారిగా షెడ్డు గోడ కూలి మీద పడడంతో వెంకటేశ్, లచ్చన్న మృతి చెందారు. ఈ ఘటనలో ఆకుల మల్లయ్య, ఎంబడి లచ్చన్న, శ్రీదర్ల హరీశ్ అనే మరో ముగ్గురు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న శ్రీదర్ల హరీశ్‌ను మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు.

బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పరామర్శ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంటను కాపాడుకోవడానికి వెళ్లిన రైతులు మృతి చెందిన విషయం తెలియగానే మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు బుధవారం ఉదయాన్నే లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానకు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. పార్టీ సూచనల మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి లక్షెట్టిపేటకు వచ్చారు. ప్రభుత్వ దవాఖానలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం కారణంగా, వర్షంలో పంటలను కాపాడుకోవాని వెళ్లి మృత్యువాత పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మెరుపు ధర్నాకు దిగింది. లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానలో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బాధిత కుటుంబాలు స్థానిక ఉత్కూర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై బైఠాయించారు. ఉదయం 10 గంటలకు మొదలైన ధర్నా సాయంత్రం 5.30 వరకు కొనసాగింది. ఎండను లెక్కచేయకుండా బీఆర్ఎస్ నాయకులు జీవన్‌రెడ్డి, దివాకర్‌రావు, విజిత్‌రావు బాధితులతో కలిసి ధర్నాలో కూర్చొన్నారు. మంచిర్యాల కలెక్టర్ వచ్చి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించే వరకు ధర్నా విరమించేది లేదని బీష్మించుకొని కూర్చొన్నారు.
ఈ క్రమంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో అరెస్టు చేస్తారని అంతా భావించారు. చివరకు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఘటన స్థలానికి వచ్చిన మంచిర్యాల డీసీపీ భాస్కర్, జేసీ రాములుతో కలిసి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఉదయం నుంచి కలెక్టర్ దిపక్కుమార్ సీఎస్‌తో మాట్లాడుతున్నారని, తప్పకుండా రైతులకు న్యాయం చేస్తారని డీసీపీ చెప్పారు. ధర్నాతో రాకపోకలు నిలిచిపోయాయని జనాలు అవస్థలు పడుతున్నారని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ప్రమాదవశాత్తు జరగలేదన్నారు. ఇందులో రాజకీయాలు ఏం చేయడం లేదని కేవలం అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ చేతగాని తనంతోనే రైతులు మృతి చెందారన్నారు. బాధ్యులైన అధికారులపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
భర్త, కొడుకు చనిపోయిన బాధలో బాధితురాలు 8 గంటలుగా ధర్నాలో కూర్చుందన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. చనిపోయిన రైతులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కలెక్టర్ సీఎస్‌కు రికమెండ్ చేస్తారని హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన కాపీ బాధితులకు, మా మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుకు ఇవ్వాలని జీవన్‌రెడ్డి సూచించారు. ధాన్యం తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కేసు పెట్టాల్సిందేనని కోరారు. ఒకవేళ కేసు పెట్టని పక్షంలో డీసీపీ, ఏసీపీ దానికి పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి అధికారులు తప్పకుండా రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాకు రికమెండ్ చేస్తామని, ఇందుకు సంబంధించిన లెటర్ కాపీ హామీ ఇచ్చారు. దీంతో సాయంత్రం 5.30 గంటలకు బీఆర్ఎస్ నాయకులు, బాధితులు ధర్నా విరమించారు.

కారకులైన అధికారులపై కేసు పెట్టాల్సిందే..
– బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన 24 గంటల్లో ధాన్యాన్ని షిప్ట్ చేయాలని జీవన్‌రెడ్డి అన్నారు. మృతి చెందిన రైతులు, రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం దవాఖానకు వచ్చిన లక్షెట్టిపేట ఎంఆర్వో దిలీప్‌కుమార్‌పై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మీరు ధాన్యం తరలించకపోవడంతో గంపలపల్లి రైతు నాగరాజు ఆయన కొడుకు అభిరామ్ మృతి చెందారన్నారు. తూకం వేసిన ధాన్యం 10 రోజులైనా తరలించకపోవడంతో వర్షానికి బస్తాలు తడవకుండా కాపాడేందుకు వెళ్లి గోడ కూలి ఇద్దరు చనిపోయారన్నారు. కొత్తూరులో ధాన్యం కల్లాలకు వచ్చి 20 రోజులైనా ఈ సర్కార్ కొనుగోలు చేయకపోవడంతో, రైతులు మృతి చెందాల్సి వచ్చిందన్నారు. దీనికి కారణం ఎవరు, బాధ్యులు ఎవరు అని జీవన్‌రెడ్డి స్థానిక ఎంఆర్వోను నిలదీశారు. తూకం వేసి 10 రోజులు అవుతున్నా ధాన్యం తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఆర్డీవో పీడీపై, దీనికి బాధ్యులైన రెవెన్యూ జాయింట్ కలెక్టర్‌పై, కలెక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పీఎస్ఆర్పై విచారణ చేయించాలి
– మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడానికి, ఈ రోజు పండిన పంటను కాపాడుకోవడానికి వెళ్లి నలుగురు మృతి చెందడానికి కారణం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు. 2023లో బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఇదే సమయానికి మే 6 నాటిని జిల్లాలో 60 శాతం వడ్లు లిఫ్ట్ చేశామని, కానీ ఇవాళ జిల్లాలో ఆరు శాతం వడ్లు కూడా లిఫ్ట్ చేయలేదన్నారు. గంపలపల్లిలో తూకం వేసి పది రోజులు పూర్తవుతున్నా ధాన్యం తరలించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ధాన్యం తీసుకుపోవాలంటే రైతుల నుంచి ఒక్కో బ్యాగ్‌కు రూ.2 అడుగుతున్నారని, 40 కిలోలు తూకం వేయాల్సిన బ్యాగ్‌ను 43 కిలోలకు వేస్తూ క్వింటాలుకు ఏడున్నర కిలోలు ఎక్కువ తూకం పెడుతున్నారన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు రైస్ మిల్లర్ల దగ్గర ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నారని, దాన్ని ఇప్పుడు మిల్లర్లు రైతుల నుంచి బస్తాకు రూ.2చొప్పున, క్వింటాకు ఏడున్నర కిలోల ఎక్కువ తూకం రూపంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తిన్నాక తడాఖా ఎక్కడిది.. ఇది నిజం కాదా దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే పీఎస్ఆర్ కారణంగానే ఈ రోజు నలుగురి ప్రాణాలు పోయాయన్నారు. ఇందుకు కారకులైన అధికారులపై కేసులు పెట్టాలన్నారు. రైస్ మిల్లర్ల దగ్గర ప్రేమ్‌సాగర్‌రావు డబ్బులు తీసుకున్నారని, ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు.
