తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్లో యూరియా కొరత (Urea shortage) కొనసాగుతోంది. రోజులు, నెలలు గడుస్తున్నా అన్నదాతలకు యూరియా మాత్రం అందడం లేదు. కొందరు రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాండూర్ ( Tandur ) మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రానికి 14.97 మెట్రిక్ టన్నులు 333 బస్తాల యూరియా రాగా పలు గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం కార్యాలయం ముందు బారులు తీరారు.
కాంగ్రెస్ సర్కార్ చేతకానితనం వల్లనే యూరియా తిప్పలు ఏర్పడుతున్నాయని క్యూలో నిల్చున్న రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోరు వానలు కురుస్తున్నప్పటికీ ఎరువుల కోసం పడరానిపాట్లు పడుతున్నామన్నారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ సీఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యాలయంలో అందుబాటులో ఉన్న స్టాకును ఒక్కో రైతుకు రెండు బ్యాగులు పంపిణీ చేశామన్నారు. మళ్లీ రెండు రోజుల్లో యూరియా స్టాకు వస్తుందని సోమవారం ప్రతి రైతుకు యూరియా అందస్తామని వెల్లడించారు.