అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ మరిచింది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కౌలు రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అందజేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా కౌలు రైతులకు రైతు భరోసా గానీ, పథకాలు గానీ అమలు చేయలేదు. కనీసం విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడం లేదని, పంటల విక్రయాలకు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో కౌలు రైతుల్లో ఎక్కువగా వ్యవసాయ కూలీలే ఉన్నారు. ఒక్కో రైతు సగటున ఐదు ఎకరాల వరకు ఎకరాకు రూ.12 వేల నుంచి రూ.22 వేల చొప్పున చెల్లించి భూమిని కౌలుకు తీసుకుంటారు. వానకాలం, యాసం గి సీజన్లలో పంటలను సాగు చేస్తూ ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. జిల్లాలో సాగునీటి వనరులు తక్కువగా ఉండడంతో ఎక్కువగా వర్షాధారంపైనే ఆధారపడుతున్నారు. వానకాలంలో పత్తి, సోయాబీన్, కంది పంటలను కౌలు రైతులు ఎక్కువగా పండిస్తారు. వానకాలం వ్యవసాయానికి వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించి, పంట తెగుళ్లు, చీడ పురుగుల సమస్యలను ఎదిరిస్తేనే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. లేదంటే నష్టాలు తప్పవు.
కౌలు రైతులు విత్తనాలు వేసింది మొదలుకుని పంటను విక్రయించేంత వరకూ పలు అనేక ఇబ్బందుల మధ్య సాగు చేస్తున్నారు. బ్యాంకులు, అప్పులు ఇవ్వకపోవడం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పథకం వర్తించకపోవడంతో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడంతో పాటు కౌలు చెల్లించేందుకు అప్పులు చేస్తున్నారు. ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే కౌలు రైతులకు అన్ని ఖర్చులు కలిపి రూ.50 వేల వరకు పెట్టుబడి అవుతున్నది. ప్రకృతి వైపరీత్యాలు ఎదిరించి ఆహర్నిశలు కష్టపడి సాగు చేసిన పంటలను మద్దతు ధరతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు కూడా అవకాశం ఉండడం లేదు.
అహర్నిశలు కష్టపడే కౌలు రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాప్‌ల ద్వారా మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఎరువులు కొనాలన్నా, పంటలు విక్రయించాలన్నా యాప్‌లలో బుక్ చేసుకోవాల్సి వస్తున్నది. కౌలు రైతులకు యాప్‌లో బుక్ చేయడం అందుబాటులో లేకపోవడంతో వారు ఎరువులను ఎక్కువ ధరతో కొనుగోలు చేస్తున్నారు. పంట విక్రయానికి సౌకర్యం లేక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నారు. పంటల సాగులో ఏ మాత్రం అటూ, ఇటూ అయిన కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా మారుతున్నది. అప్పుల పాలై ఎంతో మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నా యి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కౌలు రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 23లో వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కౌలు రైతులకు రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.15వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా అతీ, గతీ లేదు. 2011 భూ ఆధీకృత కౌలు రైతు చట్టం అమలు చేయాలి. కౌలు రైతు కార్డులు అందజేస్తే వారు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. పథకాలలో భూములున్న రైతులతో సమానంగా కౌలు రైతులకు ప్రభుత్వం హక్కులు కల్పించాలి. జేఎల్‌జీ గ్రూపులు ఏర్పాటు పంట పెట్టుబడుల కోసం బ్యాంకు రుణాలివ్వాలి. రైతులు పంటలు నష్టపోతే పరిహారం చెల్లించాలి.
– సంగె బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు