ఖానాపూర్, అక్టోబర్ 14 : నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, పెంబి మండలవాసుల సౌకర్యార్థం గత కేసీఆర్ సర్కారు సమీకృత మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. 2022 మేలో రూ.3.90 కోట్లతో టెండర్లు పిలిచి, పను లు ప్రారంభించారు. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు నిలిచాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు కాంగ్రెస్ సర్కారు బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ప్రారంభించి మూడేండ్లు గడిచిన ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కాంగ్రెస్ సర్కారు ప్రజల బాధను దృష్టిలో ఉంచుకొని సమీకృత భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని పట్టణవాసులు, వ్యాపారస్తులు కోరుతున్నారు.