మంచిర్యాల, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యేడాది క్రితం వరకు పచ్చని పల్లె ప్రకృతి వనాలు, ఊరికో ట్రాక్టర్, చెత్త సెగ్రిగేషన్ షెడ్లు, ఎక్కడికి వెళ్లినా అద్దంలా మెరిసే రహదారులు.. ఇదీ కేసీఆర్ పాలనలో గ్రామాల పరిస్థితి. ప్రతినెలా పంచాయతీల నిర్వహణకు ప్రత్యేక ని ధులు కేటాయించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాల్లోని గ్రామ పంచాయతీలను పరిశీలించి అవార్డులు ప్రకటిస్తే.. అందులో పన్నెండు అవార్డులు మన పల్లెలకే వచ్చాయి.
గ్రామాలంటే తెలంగాణలో ఉన్నట్లు ఉండాలంటూ.. అద్భుతమైన పల్లె పాలనకు కేసీఆర్ సర్కారు నిదర్శనం అంటూ యావత్ దేశం కీర్తించింది. ఇవన్నీ చేస్తూనే ఏడాదికోసారి పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రాణమంతా పల్లెలపైనే పెట్టి కేసీఆర్ సర్కారు పని చేసింది. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పరిస్థితి తారుమారైంది. గ్రామ పంచాయతీలకు వచ్చే నెలవారి నిధులు ఆగిపోయాయి.
15వ ఆర్థిక సంఘం నిధుల మంజూరు నిలిచింది. దీంతో పాలన కూనారిల్లింది. నిధులు లేక, నిర్వహణ పట్టించుకునే నాథుడు లేక పల్లె ప్రకృతి వనాలన్నీ ఎండిపోయాయి. పచ్చదనంతో కళకళలాడిన ప్రకృతి వనాల్లో ఇప్పుడు మొండి మొక్కలు కనిపిస్తున్నాయి. నిర్వహణ లేక సెగ్రిగేషన్ షెడ్లు పాడైపోతున్నాయి. కిస్తీలు కట్టలేక గ్రామ పంచాయతీల్లోని ట్రాక్టర్లు మూలకు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ పల్లె చూసినా దాదాపు ఇదే దుస్థితి కనిపిస్తున్నది.
పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి ఏడాది దాటింది. కులగణన మరోసారి చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఎన్నికలు వాయిదా పడనున్నాయి. ఇప్పటికే ఏడాది కాలంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది. కాకపోతే ఒక్కో అధికారికి మూడు, నాలుగు గ్రామాలు అప్పగించడంతో పనిభారం ఎక్కువైంది. మండలాధికారులకు బాధ్యతలు ఇవ్వడంతో పర్యవేక్షణ లోపించింది. మరోవైపు మండల పరిషత్‌లకు జిల్లా అధికారులను ఇన్చార్జిలుగా నియమించారు.
దీంతో గ్రామ, మండల స్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. సమావేశాలు, సంతకాలకే పరిమితమవ్వాల్సిన దుస్థితి నెలకున్నది. దీనికి తోడు నిధుల లేమి, పర్యవేక్షణలోపం, పాలన వ్యవహారాలు చూసేవారు కరవై జనాలు అవస్థలు పడుతున్నారు. నిధులు రాకపోవడం, ప్రత్యేక అధికారులు పట్టించుకోకపోవడంతో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపైనే పడుతున్నది.
పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ట్రాక్టర్లు, ట్యాంకర్ల మెయింటెనెన్స్, తాగునీటి పథకాలకు మరమ్మతు, పైపులైన్ లీకేజీలు, వీధి దీపాలకు మరమ్మతులు అన్ని పనులకు కార్యదర్శి బేజుల్లో నుంచి సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తున్నది. నిధుల కొరతతో పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వడం కష్టంగా మారింది. ట్రాక్టర్, ట్యాంకర్, పల్లె ప్రకృతి వనాలు వీటన్నింటని సొంత డబ్బులతో చూసుకోలేకపోతున్నామని పంచాయతీ కార్యదర్శులే వాపోతున్నారు. ఎన్నికల విషయం దేవుడెరుగు ముందు పంచాయతీలకు నిధులు ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు.