ఆదిలాబాద్, జూన్ 16(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో వానకాలం ప్రారంభకావడంతో రైతులు పత్తి, కంది, సోయా సాగు చేయడాని కి భూములను సిద్ధం చేసుకున్నారు. తొలకరి పులకరించగానే విత్తనాలు వేసేందుకు ఎదురు చూస్తున్నారు. పెట్టుబడి కోసం అవస్థలు పడాల్సి వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా వానకాలంలో 5.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా పత్తి 4 లక్షల ఎకరాల్లో పండిస్తారు. ఎకరానికు రూ.40 వేల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న యాసంగిలో అరకొరగా రైతులకు అందింది.
జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల మంది రైతులు ఉండగా.. నాలుగు ఎకరాల లోపు 90 వేల మందికి మాత్రమే ప్రభుత్వం ఎకరానికు రూ.6 వేల చొప్పున రైతు భరోసా పంపిణీ చేసింది. వానకాలం ప్రారంభమైన రైతు భరోసా ఊసే లేకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం కమీషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. వారి వద్ద నుంచి ఎక్కువ వడ్డీతో బాకీలు తీసుకుని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు.
జొన్నల డబ్బులకు ఎదురుచూపు
జిల్లాలో రైతులు యాసంగిలో జొన్న పంటను ఎక్కువ పండిస్తారు. ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేశారు. దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్లు వచ్చింది. జిల్లా వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం పంటను సేకరించింది. జిల్లాలో ఏప్రిల్ 18 జొన్నల కొనుగోలు ప్రారంభం కాగా.. మే 6వ తేదీ వరకు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా 56 వేల టన్నుల పంటను మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో సేకరించారు. ఇందుకు రైతులకు రూ.180 కోట్లు రావాల్సి ఉంది.
పంటను విక్రయించిన వారం, పది రోజులకు రావాల్సిన డబ్బులు 50 రోజులు గడుస్తున్నా అందడం లేదు. ఏటా జొన్న పంటను విక్రయించిన డబ్బులతో రైతులు వానకాలం పెట్టుబడి కోసం ఉపయోగిస్తున్నారు. ఈసారి డబ్బుల పంపిణీలో జాప్యం కారణంగా పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తమకు రైతుభరోసా రాక, జొన్నలు అమ్మిన డబ్బులు అందక కమీషన్ ఏజెంట్లు వద్ద అధిక వడ్డీకి అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొంటున్నామని రైతులు అంటున్నారు.
నిర్మల్ జిల్లాలోనూ నిరీక్షణ
కుంటాల, జూన్ 16 : నిర్మల్ జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. మార్క్‌ఫెడ్ సౌజన్యంతో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 28 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా 7,543 మంది రైతుల నుంచి 2,26,583 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేశారు. వీటి రూ.76.38 కోట్లను రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. పంట విక్రయించిన 72 గంటల్లో డబ్బులను జమ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులు దాటినా ఇవ్వడం లేదు. వానకాలం సాగు కోసం జొన్నల డబ్బులను తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా.. రెండు, మూడు రోజుల్లో డబ్బులు వచ్చే అవకాశం ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.
45 రోజులైనా డబ్బులు రాలే..
పంట మార్పిడి చేసి ఈసారి జొన్న పండించిన. 68 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సర్కారు కొనుగోలు కేంద్రంలో అమ్మిన. 45 రోజులైంది. ఇంతవరకు పైసలు అకౌంట్లో పడలేదు. సార్లకు అడిగితే 2 రోజులు 3 రోజుల్లో వస్తాయి అంటున్నరు. మా కుటుంబం మొత్తం క్రాప్ లోను 1.60 లక్షలు ఉన్నా రుణమాఫీ వర్తించలేదు. వెంటనే జొన్నల పైసలు పంపించి రుణమాఫీ చేయాలి. – మనోహర్, రైతు, వెంకూర్.
రైతు భరోసా వేయలేదు..
వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతం. రెండు కాలాలు పండిస్తాం. 50 క్వింటాళ్ల జొన్న నెల కిందట సర్కార్‌కు అమ్మిన. ఇంత వరకు పైసలు రాలేవు. రైతు భరోసా కూడా రాలేదు. ఆనకాలం పంటల కోసం ఇప్పుడు భూమి పొతం చేసి విత్తుతున్నాం. ట్రాక్టరు, కూలీలు, విత్తనాలకు బాగా ఖర్చవుతుంది. రైతు భరోసా కూడా ఇంత వరకు వేయలే. పంటల పెట్టుబడికి కష్టమవుతోంది. – కన్నం లక్ష్మణ్, రైతు, అందకూర్.
అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొంటున్నాం..
నేను ఏప్రిల్ 23వ తేదీన ఆదిలాబాద్ మార్కెట్ యార్డు లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో 41 క్వింటాళ్ల జొన్నలను విక్రయించా. రూ.1.38 లక్షలు రావాల్సి ఉండగా, అధికారులు పది రోజుల్లో పైసలు వస్తాయని చెప్పారు. ఇప్పటికి 50 రోజులు గడుస్తున్నా రాలేదు. అధికారులను అడిగితే రేపూమాపూ వస్తాయంటున్నరు. వానకాలం రైతు భరోసా, జొన్నలు అమ్మిన పైసలు రాకపోవడంతో సాగు కోసం అప్పు చేయాల్సి వస్తుంది. దళారులు అధికవడ్డీలు తీసుకుని అప్పులు ఇస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా, జొన్నల పైసలు పంపిణీ చేయాలి.
– రాజు పటేల్, రైతు, చింతగూడ, ఆదిలాబాద్ రూరల్ మండలం