మంచిర్యాల, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘తెలంగాణలోని ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యం. ఇందుకోసం బడ్జెట్లో రూ.34 వేల కోట్లు కేటాయించి ఆ మొత్తాన్ని మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించాం. అదానీ, అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులను మహిళా సంఘాలకు ఇచ్చి.. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది కోటీశ్వరులను చేస్తాం.’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ప్రకటనలు గుప్పిస్తుండగా, పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది. బీఆర్ఎస్ సర్కారులో మంజూరైన మూడు మహిళా సంఘాల భవనాలను రద్దు చేయించిన కాంగ్రెస్ నేతలు.. ఆ నిధులతో జనావాసాలు లేని చోట్ల.. సొంత ప్రాపర్టీకి వెళ్లేలా రోడ్లు నిర్మించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమవుతున్నది.
మహిళా భవనాలు రద్దు చేసి.. ఆ నిధులతో రోడ్లు..
మహిళా సంఘాలకు ఊతమిచ్చే సదుద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే బాల్కసుమన్ గ్రామానికో మహిళా భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలతో పాటు జైపూర్ మండలంలోని 20 గ్రామాల్లోనూ ఈ భవనాలు నిర్మించేందుకు డీఎంఎఫ్టీ కింద నిధులు మంజూరు చేశారు. ఒక్కో భవనానికి రూ.15 లక్షలు కేటాయించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చెన్నూర్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేశారు. ఆ కృషి ఫలితంగా చాలా గ్రామాల్లో ఇప్పటికే మహిళా భవనాల నిర్మాణాలు పూర్తి కాగా, మరికొన్ని గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే జైపూర్ మండలం శివ్వారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ లీడర్ మాత్రం మహిళా సంఘాల కడుపుకొట్టి.. తాను జేబులు నింపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌనూర్, శివ్వారం, నర్సింగాపురం గ్రామాల్లో మహిళా భవనాలను రద్దు చేయడం, ఆ భవనాలకు కేటాయించిన రూ.45 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో జనావాసాలు లేని ప్రాంతాల్లో, అవసరం లేని దగ్గర రోడ్ల నిర్మాణాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నాయకుడిగా చెప్పుకునే ఆ లీడర్ ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే డీఎంఎఫ్టీ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓట్లు రాలేదని కక్ష కట్టారా..
పౌనూర్, శివ్వారం, నర్సింగాపురం గ్రామాల్లో మహిళా భవనాలను రద్దు చేయడానికి అసలు కారణం, ఎమ్మెల్యే ఎన్నికల్లో అధికార పార్టీకి తక్కువ ఓట్లు రావడమేనని స్థానికులు అంటున్నారు. లీడ్ రాలేదని, బీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు పడ్డాయనే తమ గ్రామాలపై కక్ష కట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా నాయకుడిగా చెప్పుకుంటున్న శివ్వారానికి చెందిన సదరు కాంగ్రెస్ లీడర్ ఇన్చార్జిగా ఉన్న ఈ మూడు గ్రామాల్లో ఓట్లు రాకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఉద్దేశ పూర్వకంగానే మహిళా భవనాలను రద్దు చేయించారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
మహిళా భవనాలను రద్దు చేసి పౌనూర్లోని తన ప్రైవేట్ ప్రాపర్టీకి వెళ్లేందుకు సీసీ రోడ్డు వేసుకున్నారని మండిపడుతున్నారు. జక్కయ్య ఇంటి నుంచి డంప్‌యార్డుకు స్వలాభం కోసం, రానున్న రోజుల్లో తాను చేసే వ్యాపారం కోసం సర్కార్ సొమ్ముతో రోడ్డు వేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా వ్యక్తిగత అవసరాలకు డీఎంఎఫ్టీ నిధులను దుర్వినియోగం చేయడం చట్టప్రకారం నేరమని.. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మూడు మహిళా భవనాలను రద్దు చేసి వేసిన రోడ్లు ఏవీ కూడా జనవాసాల్లో లేవంటున్నారు. అవసరం లేని చోట్ల రోడ్లు ఎందుకు వేయాల్సి వచ్చిందో అధికారులు విచారించాలంటున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మించి.. మా మూడు గ్రామాల్లో ఎందుకు నిర్మించడం లేదని, దీనికి కారణమేమిటో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఓట్లు వేయకపోతే మహిళా భవనాలను రద్దు చేసి కాంగ్రెస్ లీడర్ల సొంత అవసరాలకు రోడ్లను నిర్మించుకుంటారా..
అని నిలదీస్తున్నారు. నర్సింగాపురం గ్రామంలో మహిళా భవనాన్ని రద్దు చేసినప్పుడు.. దానికి సంబంధించిన రూ.15 లక్షలు ఆ గ్రామంలోనే ఖర్చు చేయాలి. కానీ, ఇక్కడ మా త్రం నర్సింగాపురంకు కేటాయించిన డబ్బులతో శివ్వా రం, పౌనూర్తో పాటు వేలాల గ్రామాల్లో పనులు చేశారు. దీనిపై నర్సింగాపూర్ గ్రామస్తులు మండిపడుతున్నారు.
మా ఊరులో ఆ నిధులు ఖర్చు చేయకుండా పక్క గ్రామాలకు తరలించారంటూ వాపోతున్నారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో పక్షపాతంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.45 లక్షల డీఎంఎఫ్టీ నిధులు దుర్వినియోగం చేశారని.. కాంట్రాక్టర్‌గా ఉన్న సదరు కాంగ్రెస్ లీడర్ జేబులు నింపేందుకు పనులు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేసి నిధులు దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
డీఎంఎఫ్టీ నిధులు దుర్వినియోగం
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మహిళలకు ఉపయోగపడేలా భవనాలు నిర్మించాలని నిధులు ఇచ్చారు. కానీ మా పౌనూరులో మహిళా భవనాన్ని ఎందుకు క్యాన్సల్ చేశారో అధికారులు, నాయకులు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేదనే క్యాన్సల్ చేశారా.. అన్నది స్పష్టం చేయాలి. అసలు జనావాసాలు లేని దగ్గర రోడ్లు ఎందుకు వేశారో అర్థం కావడం లేదు. మా ఊరు ఏం అన్యాయం చేసిందని భవనాన్ని రద్దు చేశారో కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి.
మహిళలకు నష్టం చేసి కాంట్రాక్టర్‌కు బెనిఫిట్ చేసేందుకు రోడ్లు నిర్మించారు. ఓట్లు వేయలేదని మా ఊరు ప్రజల మీద కక్షగట్టారు. ఓ కాంగ్రెస్ లీడర్ తన భూమికి పోయేందుకు డీఎంఎఫ్టీ నిధులతో రోడ్డు వేసుకున్నాడు. మహిళా భవనాల కోసం మంజూరు చేసిన రూ.45 లక్షలు దుర్వినియోగం చేశారు. డీఎంఎఫ్టీ నిధులు ప్రజల కోసం, ప్రజావసరాల కోసం వాడాలి. కానీ ఓ నాయకుడి స్వార్థం కోసం, ఆయనకు లబ్ధి చేకూర్చుడం కోసమే పనులు చేశారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– జాడి ఏసయ్య, జైపూర్ మాజీ ఎంపీపీ
మా ఊరు ఏం అన్యాయం చేసింది
మా ఊరు ఏం అన్యాయం చేసిందని మహిళా భవనాన్ని రద్దు చేశారు. మా ఊరిలో భవన నిర్మాణానికి ఇచ్చిన డబ్బులతో మా దగ్గర ఖర్చు పెట్టకుండా శివ్వారం, పౌనూర్కు ఎందుకు తరలించారు. మాపై ఎందుకు కక్ష కట్టారు. మా గ్రామంలో కూడా రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇక్కడ పెట్టకుండా పక్కనున్న గ్రామాలకు ఆ నిధులు ఎందుకు ఇచ్చారు. ఇది సరైన పద్ధతి కాదు. అవసరం లేని దగ్గర రోడ్లు నిర్మించిన కాంట్రాక్ట్‌పై చర్యలు తీసుకోవాలి. మండలంలోని అన్ని గ్రామాల్లో మాదిరిగానే మా ఊరిలోనూ మహిళా భవనాన్ని నిర్మించాలి.
– బోయిని నాగరాజు, నర్సింగాపూర్ గ్రామస్థుడు