మంచిర్యాల, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలోని బీసీలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మోసం చేసింది. ఎన్నికలకు ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ రాహుల్‌గాంధీ సమక్షంలోనే బీసీ డిక్లరేషన్ చేసింది. కానీ.. అన్ని హామీల మాదిరిగానే బీసీలకు ఇచ్చిన మాటపై నాలుక మడతేసింది. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని గెలిచిన నాటి నుంచి ఊరించి ఇప్పుడు ఉసూరు మనిపించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని, ఒప్పుకుంటే అమలు చేస్తామంటూ చేతులు ఎత్తేసింది. కేంద్రం ఆమోదించకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్ల వాటా కల్పిస్తామంటూ సీఎం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టి చేతులు దులుపుకుంది. దీనిపై బీసీ సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. రాహుల్‌గాంధీ చెప్పింది అబద్ధమేనా? అని మండిపడుతున్నారు. రైతుబంధు, రైతుభరోసా విషయంలో రైతులను మోసం చేసినట్లే బీసీలను మోసం చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని అంటున్నారు.
మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 5: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జన గణన పేరిట బీసీ వర్గాలను మోసం చేసింది. పూర్తిస్థాయిలో సర్వేచేయకుండానే కుల గణన పూర్తయిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. కుల గణనలో తప్పుల తడకగా ఉంది. కేవలం 42 శాతం మాత్రమే బీసీలు ఉన్నట్లు పేర్కొనడం వెనక ఆంతర్యం ఏమిటన్నది అర్థం కావడం లేదు. దాదాపు 52 శాతం బీసీలు, ముస్లిం బీసీల జనాభా దాదాపు 10శాతం కలుపుకుని రాష్ట్రంలో మొత్తం బీసీ జనాభా 60 శాతానికి పైగా ఉంటుంది. కానీ ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా భారీగా తగ్గిందని, ఓసీ జనాభా పెరిగిందని చూపించారు. దీనిపై ప్రజానీకం అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం పారదర్శకంగా సర్వేను నిర్వహించి ప్రజలకు వివరాలను వెల్లడించాలి. ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలోకి నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నది. బీఆర్ఎస్ చేపట్టిన ఇంటింటి సర్వేను పక్కన పెట్టి కొత్తగా సర్వే చేశామని చెప్పి బీసీ ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నది.
మొన్నటి వరకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. ఇప్పుడు పార్టీ పరంగా వాటాకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. కానీ.. దానితో ఒరిగేదేం లేదని బీసీ సంఘాలు అంటున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించకుండా పార్టీ పరంగా వాటా ఇస్తామనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వాటా కల్పిస్తారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ నుంచి వాటా ఇస్తారా? అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇస్తారా? చెప్పాలంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను వాడుకుని లబ్ధిపొందడం కోసమే ఈ నాటకం ఆడుతున్నారంటున్నారు. అదే 42 శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పిస్తే అసెంబ్లీ నుంచి పార్లమెంట్ దాకా మాకు రావాల్సిన వాటా వస్తుందంటున్నారు. జనగణన ఇంటింటి సర్వే తప్పుల తడకగా ఉన్నందుకే రిజర్వేషన్ విషయంపై ధైర్యం చేయలేకపోతుందని ఆరోపిస్తున్నారు. ఈ తప్పుడు లెక్కలే ప్రామాణికమని చెప్పకనే చెప్పుకుంటూ.. బీసీల నుంచి వ్యతిరేకత రాకుండా తప్పించుకునేందుకే కేంద్రంపైకి నెపం నెడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ కులగణన లెక్కలు, అసెంబ్లీ తీర్మానాలను బీసీలెవరూ హర్షించడం లేదంటున్నారు. అమలు సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేదే లేదని బీసీ సంఘాలు, నాయకులు హెచ్చరిస్తున్నారు.
నిర్మల్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభు త్వం చేపట్టిన కుల గణన సర్వే అసమగ్రంగా ఉంది. హడావుడిగా సర్వే పూర్తి చేసి తప్పుల తడకగా నివేదిక రూపొందించారు. బలహీన వర్గాలను అణగదొక్కేం దుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కుట్రకు తెరలేపా రు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 52 శాతం బీసీలు ఉన్నట్లు నిర్ధార ణ కాగా, ఇప్పుడు 46 శాతమే ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించడం దారుణం. రోజు రోజుకు జనాభా పెరుగుతుంది. కానీ.. తగ్గదు కదా. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం 42 శాతం బీసీ కోటా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఎత్తేసేందుకు యత్నించడం శోచనీయం. ఇదీ ముమ్మాటికీ బీసీలను మోసం చేయడమే. నకిలీ గాంధీలను తీసుకొచ్చి ఆర్భాటంగా ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకపోతే బీసీలకు రాజకీయాల్లో అవకాశాలు తగ్గిపోతాయి. రాజకీయాల్లో ఏ కులాలకైతే స్థానం ఉండదో ఆయా జాతులు అంతరించిపోయే అవకాశం ఉందని ఆనాడే అంబేద్కర్ చెప్పారు. రాజకీయ పదవుల్లో ఉంటే వారు తమ జాతిని రక్షించుకునేందుకు పాటు పడుతారు. ఆర్థిక పరంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు, నిధుల కేటాయింపు వారి కులాలకు కేటాయించుకునే వెసులుబాటు ఉంటుంది. కొన్ని కులాలకు వారి జనాభా 7 శాతం ఉంటే 7 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మరి 56 శాతం ఉన్న బీసీలకు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. బీసీల అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మళ్లీ సర్వే నిర్వహించి వాస్తవాలను బయటపెట్టాలి. ఇస్తామన్న రిజర్వేషన్లు ఇవ్వకుండా తగ్గించే కుట్రలకు పాల్పడితే రేవంత్‌రెడ్డి బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు.
ఇచ్చోడ, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ జనాభా గణనలో ఇటీవల విడుదల చేసిన నివేదికపై అనుమానాలు ఉన్నాయి. గ్రామ, మండల స్థాయిలో కులగణన సక్రమంగా జరగలేదు. తప్పుడు సర్వేతో బీసీలు నష్టపోతున్నారు. తాజాగా ప్రభుత్వం వెల్లడించిన కుల గణన సర్వే జాబితా తప్పుల తడకగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సర్వే నిర్వహించి కచ్చితమైన సంఖ్య ప్రకటించాలి.
ఇచ్చోడ, ఫిబ్రవరి 5 : బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేనే నిజం. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కుల గణన సర్వేలో 21 లక్షల మంది బీసీలు ఏమయ్యా రు. బీసీల గణనను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల తడకగా రూపొందించింది. ఎన్యుమరేటర్లు అరకొర సమాచారం సేకరించారు. ప్రభుత్వం ముందస్తుగానే కులం వివరాలు చెప్పకపోయిన పర్వలేదంది. దీంతో బీసీల సంఖ్య తక్కువ వస్తుందని అనుమానం.
మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి కుల గణనను రద్దుచేసి తిరిగి మళ్లీ బీసీ జన కుల గణనను చేపట్టాలి. కుల గణన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ప్రజలను మోసం చేసింది. కుల గణనను శాస్త్రీయంగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన తప్పుల తడకగా ఉంది. గత ప్రభుత్వాలు చేసిన లెక్కల ప్రకారం పోలిస్తే బీసీలను ఇప్పుడు తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇదే సమయంలో ఓసీల జనాభా పెరిగినట్లు చూపిస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అగ్రవర్ణాల ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. మళ్లీ సమగ్రంగా బీసీ కులగణన జరిపించాలి. అదికూడా శాస్త్రీయంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాస్తవ లెక్కలు బయటపెట్టి ప్రభుత్వానికి బీసీలపై ఉన్న నిబద్ధతను నిరూపించుకోవాలి.