‘కాంగ్రెస్ రూ. 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తామని మాట తప్పింది. అన్ని అర్హతలున్నా లేనిపోని సాకులు చెబుతూ తప్పించుకోవాలని చూస్తుంది. రుణమాఫీ ఎందుకు కాలేదని సార్లను అడిగితే.. తెల్లకాగితాలపై దరఖాస్తులు పెట్టుకోవాలని చెబుతున్నరు. అది లేదు.. ఇది లేదు.. అందుకే మాఫీ కాలేదంటున్నరు. ఇదెక్కడి న్యాయం’ అంటూ రైతులు కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి, కన్నాల, కాసిపేట, కన్నెపల్లి మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడగా, వారు ఇలా స్పందించారు.
కన్నాలలో మస్తు మందికి కాలే..
బెల్లంపల్లి, ఆగస్టు 25 : మా ఊరిలో మస్తు మంది రైతులకు రుణమాఫీ కాలే. సార్లను అడిగితే అది ఉంటే.. ఇది లేదని.. ఇది ఉంటే అది లేదని కొర్రీలు పెడుతున్నరు. ఏదో ఒక సాకు చెబుతున్నరు. నేను రూ. లక్షా 25 వేల రుణం తీసుకున్న. నాకు రుణమాఫీ కాలేదు. ఆధార్‌కార్డులో ఉన్న వివరాలతో సరిపోలేదంటున్నరు. తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకుంటే ఉన్నతాధికారులకు పంపిస్తమంటున్నరు. ఎవుసాన్నే నమ్ముకొని జీవిస్తున్నం. కాంగ్రెసోళ్లు గిట్ల ఆశపెట్టి మోసం చేసుడేంది. – రాజయ్య,కన్నాల
రుణమాఫీ కపాయె..
కాసిపేట, ఆగస్టు 25 : కాంగ్రెసోళ్లు ఎన్నికలకు ముందు రూ.రెండు లక్షల దాకా రుణ మాఫీ చేస్తమన్నరు. అధికారంలోకి వచ్చాక సాకులు చెబుతున్నరు. నాకు రూ.లక్షా 90 వేల పంట రుణం ఉంది. ఇప్పటి వరకు మాఫీ కాలే. ఎవుసం చేసుకొని బతికేటోళ్లం. ఆఫీసుల చుట్టూ తిరిగి యాష్టకొస్తుంది. కేసీఆర్ సర్కారులో గిట్లా చేయలే. అందరికీ మాఫీ చేసిన్రు. ఇకనైనా సీఎం రేవంత్‌రెడ్డి రైతులను గోస పెట్టకుండా న్యాయం చేయాలె.
– సంకూరి పోశం, కాసిపేట
ఇదంతా ఎగ్గొట్టేందుకే..
బెల్లంపల్లి, ఆగస్టు 25 : నా పేరు మీదున్న భూమి పేరిట బ్యాంక్‌లో రూ. లక్షా 90 వేల రుణం తీసుకున్న. నాకు రేషన్ కార్డు లేదని రుణమాఫీ కాలేదంటున్నరు. దరఖాస్తు పెట్టుకోమని చెబుతున్నరు. పెట్టుకున్నా రుణమాఫీ చేస్తరన్న నమ్మకం లేదు. కేసీఆర్ సర్కారులో ఇలాంటి నిబంధనలు లేకుండే. రుణం తీసుకున్న ప్రతి రైతుకూ మాఫీ చేసిన్రు. రుణమాఫీని ఎగ్గొట్టేందుకే ఈ నిబంధనలు పెట్టినట్లుంది. ఎవుసం చేసుకునేటోళ్లకు ఈ నిబంధనలేమిటో. గతంలో రుణం తీసుకున్నాం. యేటా కట్టినం. గిప్పుడైతే ఏదేదో చెబుతున్నరు.
– లక్ష్మణ్‌గౌడ్, చంద్రవెల్లి
మా ఇద్దరిలో ఒకరికీ కూడా కాలే
కన్నెపల్లి, ఆగస్టు 25 : కన్నెపల్లి బ్యాంకులో నా పేరు మీద, నా భార్య పేరు మీద క్రాప్ లోన్ ఉంది. ఇద్దరం కలిసి రూ. 2.20 లక్షల లోను తీసుకుంటా కట్టుకుంటున్నం. ఎన్నికలప్పుడు రూ. 2 లక్షలు మాఫీ చేస్తామనంగనే మస్తు సంబురపడ్డం. కానీ ఇప్పడు మా ఇద్దరిలో ఒకరి కూడా మాఫీ కాలేదు. లేనిపోని లింకులు పెట్టి రైతులను గోస పెట్టుకుంటున్నరు. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి, అక్కడ దరఖాస్తు చేసుకోండి అని ఆఫీస్‌ల చుట్టూ తిప్పుతున్నారు. గిదెక్కడి న్యాయం.
– గురుండ్ల హన్మంతు, కన్నెపల్లి
చెప్పిందొకటి చేసేదొకటి
కన్నెపల్లి, ఆగస్టు 25 : ఎన్నికలప్పుడు రూ. రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు రైతులను అరిగోస పెట్టుకుంటున్నరు. కొందరికి చేసి.. మరికొందరికి చేయకపోవడం అన్యాయం. నాకు రూ. 2.30 లక్షల రుణం ఉంది. రూ. 2 లక్షలకు పైగా ఉన్నోళ్లందరినీ కట్టమంటే ఎక్కడికి పోయేది. మళ్లా అప్పుల పాలు చేసుడేకదా. ఇప్పటికే బోలెడన్ని అప్పుల్లో ఉన్నాం. ఇకనైనా మాకు న్యాయం చేయాలె.
– వడాయి సురేందర్,కన్నెపల్లి