నిర్మల్, మే 11(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మల్ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలతోపాటు ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలను కేంద్రీకృతం చేస్తూ రూపొందించిన టూరిజం కారిడార్ ప్రతిపాదనలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కా గా.. ఆచరణకు నోచుకోకపోవడంపై ప్రస్తుత ప్రభుత్వంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టూరిజంకు పూర్తి అనుకూలంగా ఉన్న నిర్మల్ జిల్లాను ప్ర భుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా బాసర సరస్వతీ దేవి ఆలయం నుంచి మొదలుకుని కదిలి పాపహరేశ్వర ఆలయం, కాల్వ లక్ష్మీనరసింహ ఆలయాలతో ఈ కారిడార్‌ను నిర్మల్‌లోని చారిత్రక కట్టడాలు, కొయ్యబొమ్మలతోపాటు కడెం, సదర్మాట్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను కలుపుకుని కవ్వాల్ టైగర్ జోన్ వరకు ఈ కారిడార్ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ హయాంలో ప్రతిపాదనలను రూపొందించారు.
అప్పటి ప్రభుత్వం పర్యాటకరంగా అభివృద్ధిని బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని యాక్షన్ ప్లాన్ తయా రు చేసింది. స్థానిక ప్రకృతి పరమైన ప్రదేశాలను అభివృద్ధి చేస్తూనే, స్థానికులకు ఈ రంగం ద్వారా ఉపాధి కల్పించాలన్నదే కారిడార్ ప్రధాన లక్ష్యంగా నిర్ధారించారు. దీని కోసం అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పనులు నిలిచాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతున్నప్పటికీ ఇప్పటివరకు నయాపైసా విదల్చలేదు. అప్పటి ప్రభుత్వం ఈ టూరిజం కారిడార్‌ను పీపీపీ(పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్) పద్ధతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడమే కాకుండా ఇందుకోసం అవసరమైన చర్యలను చేపట్టింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానంపై ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. చాలా చోట్ల పీపీపీ విధానంతో పర్యాటకరంగం అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఈ రంగం నీరుగారుతున్నది.
సహజ సిద్ధమైన ప్రకృతి సంపదతో కళకళలాగే కవ్వాల్ టైగర్ జోన్‌పైనా కాం గ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం టూరిజం కారిడార్ ఏర్పాటులో భాగంగా తడోబా తరహాలో ఇక్కడ అభివృద్ధి చేయాలని తలపెట్టింది. టైగర్ జోన్ పరిధిలోని 78 వేల హెక్టార్ల నుంచి 20 శాతం మేర కోర్, బఫర్ ఏరియాలను టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దాలని భావించింది. ఎకో టూరిజం పేరిట టూరిస్టులను ఆకర్షించేందుకు కోర్, బఫర్ ఏరియాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కవ్వాల్ టైగర్ జోన్‌ను తిలకించేందుకు ఐదు సఫారీ వాహనాలను సమకూర్చేందుకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నుంచి ఆర్థిక సహకారం తీసుకునేందుకు నిర్ణయించారు. ఆర్థిక భారం పడకుండా పీపీపీ విధానంలో నిర్వహించేందుకు అటవీశాఖ ముందుకొచ్చింది. కవ్వాల్ పరిధిలోని కడెం, గంగాపూర్, ఎక్బాల్‌పూర్, ఉడుంపూర్, ఆకొండపేట ప్రాంతాలను ఈ టూరిజం కారిడార్ కిందకు తీసుకొచ్చారు. ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోని కల్లెడ గ్రామం వద్ద నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారి పక్కన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఐ లవ్ కవ్వాల్’ అనే లోగో అటువైపు వెళ్లే వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ ప్రాంతం నుంచి మైసంపేట, గంగాపూర్, లక్ష్మీపూర్ ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేకంగా సఫారీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రభు త్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే దిమ్మదుర్తి, జన్నారంల వద్ద మొత్తం 22 కాటేజీలను టూరిస్టుల విడిది కోసం నిర్మించాలని తలపెట్టారు. కాగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వీటి నిర్మాణం కోసం ఒక్క అడుగు ముందుకు పడలేదు.
ఎకో టూరిజంలో భాగంగా కవ్వాల్ టైగర్ జోన్‌ను టూరిస్టు స్పాట్‌గా ఏ ర్పాటు చేయాలని భావించిన బీఆర్ఎస్ ప్రభుత్వం దాని బాధ్యతను పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ (పీపీపీ) విధానంలో చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది. ఆర్థిక, నిర్వహణ పరంగా భారం కాకుండా టైగర్ జోన్ పరిధిలోని గ్రామాలకు చెందిన వీడీసీలు, అక్కడి యువకులకు సఫారీ వాహనా ల నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని భావించారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ వాహనాలను కొనుగోలు చేసి, స్థానిక యు వకులకు రుణాలు అందించి వాహనాలు వారికి అప్పగిస్తే అటు టూరిజంతోపాటు ఇటు యువతకు ఉపాధి కల్పించవచ్చన్న ఆలోచనను అప్పటి ప్రభుత్వం చేసింది. అంతేకాకుండా స్థానిక పరిస్థితులపై అవగాహన ఉం డి, అక్కడి చెట్లు, జంతువుల వివరాలు తెలిసిన వారిని టూరిస్టు గైడ్లుగా నియమించాలని నిర్ణయించారు. ఇలా జిల్లాలోని సహజ వనరులతోపాటు ఇక్కడి ఆధ్యాత్మికతను బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో ప్రణాళికలు సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఊసే లేదు. గత 16 నెలల కాలంలో పర్యాటకరంగ అభివృద్ధికి నయాపైసా విడుదల చేయకపోవడంతో గత ప్రభుత్వ ప్రణాళికలన్నీ బుట్టదాఖలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాలో టూరిజం అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.